కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసు.. ఎట్టకేలకు రాజీనామాకు ఈశ్వరప్ప అంగీకారం!

14 Apr, 2022 19:14 IST|Sakshi

కాంట్రాక్టర్‌ ఆత్మహత్యతో వివాదంలో చిక్కుకున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించిన ఈశ్వరప్ప.. గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశాడు. తనుకు మద్ధతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. 

ఇక రాజీనామా లేఖను ఈశ్వరప్ప శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి బసవరావ్‌ బొమ్మైకి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈశ్వరప్ప దిగిపోవాలంటూ విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప దిగిపోవాల్సిందేనని సీఎం బొమ్మై ఆదేశించినట్లు  తెలుస్తోంది.

బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌, బీజేపీ నేత సంతోష్‌ పాటిల్‌.. తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి పేమెంట్‌ క్లియర్‌ చేయడానికి.. 40 శాతం కమీషన్‌ కోసం తన పీఏ ద్వారా మంత్రి ఈశ్వరప్ప వేధించాడంటూ సదరు కాంట్రాక్టర్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్‌ పాటిల్‌ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్‌, రమేశ్‌ పేర్లను కూడా చేర్చారు. 

ఈశ్వ‌ర‌ప్ప‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాల‌ని కాంగ్రెస్ భారీ ఆందోళ‌న‌కు దిగింది. ఈశ్వ‌ర‌ప్ప‌, ఆయ‌న స‌న్నిహితుల‌పై ఎఫ్ఐఆర్ దాఖ‌లు కావ‌డంతో మంత్రికి సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై స‌మ‌న్లు జారీ చేశారు. అయితే దర్యాప్తు పూర్తయ్యేదాకా ఆయనపై చర్యలు ఉండబోవని సీఎం బొమ్మై చెప్పారు. ఈ లోపు కాంగ్రెస్‌ ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఇక.. తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఈశ్వ‌ర‌ప్ప ఇదివరకే ఓ ప్రకటన చేశాడు కూడా.

మరిన్ని వార్తలు