ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్‌–1’ పునరాగమనం

7 Mar, 2023 04:11 IST|Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):  నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్‌ 12న పీఎస్‌ఎల్‌వీ–సీ18 రాకెట్‌ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్‌ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్‌–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్‌ అంతరిక్ష సంస్థ (సీఎన్‌ఈఎస్‌) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి.

దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్‌ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్‌–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు.  

26న ఎల్‌వీఎం3–ఎం3 ప్రయోగం
లాంచ్‌ వెహికల్‌ మార్క్‌3–ఎం3 (ఎల్‌వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్, ఇండియన్‌ భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్త భాగస్వాములుగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్‌లోని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్‌ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్‌ దశ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్‌కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్‌షీల్డ్‌లో అమర్చే పనులు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు