కన్వర్‌ యాత్ర భక్తులకు పోలీసుల సేవలు.. కాళ్లు నొక్కి, పూలతో స్వాగతం

25 Jul, 2022 11:54 IST|Sakshi

ఈ ఏడాది కన్వర్‌ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అయితే, శ్రావణ మాసంలో శివ భక్తులు (కన్వరిలు) భక్తి శ్రద్ధలతో గంగా నది ఒడ్డుకు వెళ్లి ప్రవిత గంగా జలాలను తమ ఇళ్లలో, దేవాలయాల్లోకి నీటిని తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో గంగా నది నీటి కోసం ఉత్తరాఖండ్‌, యూపీ, హరిద్వార్‌, రిషికేశ్‌, గౌముఖ్‌, తదితర ప్రాంతాలకు కాలినడకన బయలుదేరుతారు. 

ఇదిలా ఉండగా.. కన్వర్‌ యాత్రికుల కోసం ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. భక్తులు కాలినడకన వస్తుండటంతో తీవ్రంగా అలిసిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలు వారికి సాయం అందిస్తున్నారు. తాజాగా యూపీలో కొందరు పోలీసు అధికారులు వారికి తమ వంతు సాయం అందించారు. యూపీలోని అమ్రోహాలో ఎస్‌ఐ రాజేంద్ర పుందిర్‌.. కన్వరిల కాళ్లకు పేయిన్‌ రిలీఫ్‌ స్ప్రే కొట్టి.. మసాజ్‌ చేశారు. హపూర్‌ క్యాంపులో సైతం సీఐ సోమ్‌వీర్‌ సింగ్‌.. కన్వరియాల కాళ్లు నొక్కారు. దీంతో కన్వరియాలకు కొంత ఉపశమనం కలిగింది. అంతకు ముందు.. అమ్రోహ కలెక్టర్‌, ఎస్పీ.. ఓ భక్తురాలి కాళ్లు కడిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక, హరిద్వార్‌ కన్వర్‌ యాత్రికులపై ప్రభుత్వం.. హెలికాప్టర్ల సాయంతో పూల వర్షం కురిపించింది. కొన్ని చోట్ల మతాలకు అతీతంగా ముస్లింలు కూడా కన్వరియాలకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా, జూలై 14న ప్రారంభమైన కన్వర్‌ యాత్ర.. జూలై 26తో ముగియనుంది.  

మరిన్ని వార్తలు