పూణే రైల్వే స్టేషన్లో దారుణం.. కనుమరుగైన మానవత్వం.. 

1 Jul, 2023 14:48 IST|Sakshi

పూణే: పూణే రైల్వే స్టేషన్లో అమానుషమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రైలు రావడం ఆలస్యమైన కారణంగానో మరేదైనా కారణం వల్లనో ఆదమరిచి నిద్రిస్తున్న ప్రయాణికులు కొంతమందిని నిద్ర లేపడానికి నిర్దాక్షిణ్యంగా వారి మొహం మీద నీళ్లు చల్లాడు ఓ సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్. ఈ దృశ్యాన్ని చరవాణిలో బంధించిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీనిపై స్పందిస్తూ పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ ఇందు దూబే ఇది అమానుషం అన్నారు. 

రైళ్ల రాకపోకలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని అనిశ్చితిలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో సేదదీరడం సర్వసాధారణంగానే మనం చూస్తూ ఉంటాం. రైల్వే ప్లాట్ ఫారం మీద నిద్రించడం నిబంధనలకు విరుద్ధమే. అయినా ఆ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఒక రైల్వే  కానిస్టేబుల్ మాత్రం కర్కశంగా వ్యవహరించాడు.  

రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గాఢంగా నిద్రిస్తున్న ప్రయాణికుల మొహం మీద బాటిల్ తో నీళ్లు కుమ్మరించాడు. దీంతో ఏమైందోనని ఉలిక్కిపడి లేచారు ప్రయాణికులు. వారిలో ఒక పెద్దాయన కూడా ఉన్నారు. మానవత్వాన్ని తుంగలో తొక్కిన ఈ సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో "మానవత్వానికి నివాళులు" అని రాసి పోస్ట్ చేశాడు ఒక యువకుడు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోను ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. వీరిలో అత్యధికులు రైల్వే కానిస్టేబుల్ పై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు.   

రైల్వే స్టేషన్లలో ఇతరులకు అడ్డంకిగా ఎక్కడ పెడితే అక్కడ నిద్రించడం నిబంధనలకు విరుద్ధం. ఆ విషయాన్ని వారికి మర్యాదపూర్వకంగానూ, గౌరవంగా అర్ధమయ్యేలా కౌన్సెలింగ్ చెయ్యాలి గానీ ఈ విధంగా మొహాన నీళ్లు చల్లడం తీవ్ర విచారకరమని అన్నారు రైల్వే డివిజనల్ మేనేజర్ ఇందు దూబే. నెటిజన్లు ఈ సంఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. కొంతమంది రైల్వే కానిస్టేబుల్ ను నిందించగా మరికొంత మంది అతడికి మద్దతుగా నిలిచారు.

ఇది కూడా చదవండి: ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే..   

మరిన్ని వార్తలు