ట్విటర్​ ఎండీపై పోలీసుల ఫైర్, రాకపోతే తీవ్రపరిణామాలంటూ..

22 Jun, 2021 08:32 IST|Sakshi

కొత్త ఐటీ పాలసీ, రూల్స్ పాటించాలన్న విష‌య‌ంలో కేంద్ర ప్ర‌భుత్వానికి, మైక్రో బ్లాంగిగ్​ సైట్​ ట్విటర్ మధ్య కోల్డ్​ వార్​ నడుస్తోంది. ఇప్పటికే ట్విటర్‌కు మ‌ధ్య‌వ‌ర్తిత్వ హోదా కేంద్రం తొల‌గించగా.. ఘజియాబాద్​ వృద్ధుడి దాడి ఘటనలో యూపీ పోలీసుల నోటీసులతో ఇరకాటంలో పడింది. తాజాగా ఈ కేసులో ట్విటర్​ ఎండీ మనీశ్​ మహేశ్వరిని తమ ఎదుట హాజరుకావాలని ఘజియాబాద్​ పోలీసులు నోటీసులు కూడా పంపారు. అయితే తాను వర్చువల్ విచారణకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో యూపీ పోలీసులు సున్నితంగా హెచ్చరించారు.  

లక్నో: యూపీ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీ మ‌నీశ్ మ‌హేశ్వ‌రికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన స్వ‌యంగా లోనీ బోర్డ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జూమ్​లో విచారణ కుదరదని, స్వయంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది యూపీ పోలీస్​ శాఖ. లేని పక్షంలో కేసు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని భావించాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. చ‌ట్ట బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో 26 సార్లు నోటీసులు పంపినప్పటికీ మనీష్​ స్పందించలేదని ఘజియాబాద్​ పోలీసులు ఆరోపిస్తున్నారు.

కాగా, ఘజియాబాద్​లో ఓ వృద్ధుడి మీద జరిగిన దాడి ఘటనకు మతం రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తే.. ట్విటర్​ ద్వారా ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. దీంతో ట్విటర్​ నిర్లక్ష్యం వహించిందనేది యూపీ పోలీసుల ఆరోపణ. ఈ మేరకు ట్విటర్​పై ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో ఎండీ మనీష్​ మహేశ్వరికి నోటీసులు పంపారు. కాగా, ఇటువంటి వివాదాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, వీటిని తాన్ డీల్ చేయ‌న‌ని మనీష్ ఇదివరకే పోలీసులకు బదులు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ వివరణపై సంతృప్తి చెందని ఘ‌జియాబాద్ పోలీసులు.. ఫేస్​ టు ఫేస్​ విచారణను ఎదుర్కొవాల్సిందేనని తేల్చిబాధ్యత చెప్పారు. 

చదవండి: బాధ్యత ఉండక్కర్లా?
 

మరిన్ని వార్తలు