ప్రవక్తపై వ్యాఖ్యలు: రెచ్చిపోయి చితకబాదిన పోలీసులు.. కోర్టు సీరియస్‌

4 Jul, 2022 16:02 IST|Sakshi

బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాద్‌లు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారి వ్యాఖ‍్యల కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనల్లో భాగంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 

కాగా, ఉత్తర ప్రదేశ్‌లో కూడా నిరసనల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. షహరాన్‌పూర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ పోలీసులు లాఠీలు ఝళిపించారు. అల్లర్లలో పాల్గొన్నారని ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్ట్‌ చేసి.. లాకప్‌లో లాఠీలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో, వారి పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన స్థానిక కోర్టు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్‌ చేసిన 8 మంది అలర్లల్లో పాల్గొన్నారనేందుకు సాక్ష్యాలను పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వారిని నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించింది. ఇక, పోలీసులు దారుణంగా కొట్టడంతో మహ్మద్‌ అలీ అనే వ్యక్తి చేయి విరిగిపోయింది. 

ఇదిలా ఉండగా.. షహరాన్‌పూర్‌లో పెద్దఎత్తున అల్లర్ల కారణంగా 300 మందికి పైగా వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు లాఠీలతో కొట్టిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే షలభ్ మణి త్రిపాఠి స్పందించారు. ఈ వీడియోకు ''అల్లరిమూకకు రిటర్న్ గిఫ్ట్'' అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ‍్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కర్కశకంగా కోటింగ్‌.. దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయిన చిన్నారి
 

మరిన్ని వార్తలు