3 నిమిషాల్లో 3 కిలోమీటర్లు.. జెట్‌ స్పీడులో దూసుకొచ్చి ప్రాణం కాపాడిన పోలీసులు

20 Oct, 2021 17:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నొయిడా: కేవలం మూడు నిమిషాల్లోనే 3 కిలోమీటర్లు ప్రయాణించి ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడారు పోలీసులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తన భార్యతో ఏదో విషయమై గొడవ పడ్డాడు. వాగ్వాదం అనంతరం ఆ భార్య పొలానికి వెళ్లిపోయింది. భార్యతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన భర్త​ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ బాధతో మద్యంతాగి ఇంట్లోకి వెళ్లి కోపంతో తలుపువేసుకున్నాడు. ఇదంతా గమనించిన అతని కుమార్తె వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో ఆ యువకుడు తన చెల్లికి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు. సోదురుడు సూచించిన మేరకు ఆ బాలిక పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే 3 కిలోమీటర్లు ప్రయాణించి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వారు కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతున్న వ్యక్తి కనిపించడంతో పాటు స్థానిక ప్రజలు గుమికూడి అతను చనిపోయినట్లుగా భావిస్తుంటారు. అయితే అతనిలో ఇంకా కొంచెం కదలిక ఉందని పోలీసుల్లో ఒకరు గమనించి వెంటనే తలుపులు బద్దలు కొట్టి అతని ప్రాణాలను కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నట్టు సమాచారం.

చదవండి: ఇకపై కొత్త చట్టం.. పిల్లలు తప్పు చేస్తే తల్లిడండ్రులకు శిక్ష.. ఎక్కడంటే

మరిన్ని వార్తలు