Morbi Bridge Collapse: కేబుల్‌ బ్రిడ్జి దుర్ఘటనలో మా ప్రమేయం లేదు, దైవ నిర్ణయం.. కోర్టులో నిందితులు

2 Nov, 2022 15:05 IST|Sakshi

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో కూలిన కేబుల్‌ బ్రిడ్జి కేసులో అరెస్టయిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మచ్చు నదిపై  బ్రిడ్జి పునరుద్దరణ పనులు చేపట్టిన అజంతా ఒరేవా కంపెనీని ప్రాసిక్యూషన్‌ తప్పుబట్టారు. పునరుద్దరణ పనులకు ఒరివా కంపెనీకి అసలు అర్హత లేదని మోర్బీ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ ఇదే కంపెనీకి 2007, 2022లో బ్రిడ్జి రిపేర్‌ పనులకు కాంట్రాక్టు అప్పగించినట్లు తెలిపారు.

వంతెన పునరుద్ధరణ సమయంలో ఫ్లోరింగ్‌ మార్చారు. కానీ అరిగిపోయిన తీగల స్థానంలో కొత్తవి అమర్చలేదని, పాత వాటిని అలాగే ఉంచారని ఆరోపించారు. దీనివల్ల కొత్తగా వేసిన నాలుగు లేయర్ల అల్యూమినియం ఫ్లోర్‌ బరువు ఎక్కువగా ఉండటంతో పాత తీగలు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్‌ నివేదిక ద్వారా తెలిసిందన్నారు.
చదవండి: Hemant Soren: జార్ఖండ్‌ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం

గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ఘటనకు సంబంధించి కోర్టులో హాజరు పరిచిన నిందితుల్లో ఒరేవా కంపెనీ మేనేజర్‌ దీపక్‌ పరేఖ్‌ కూడా ఒకరు. అయితే వంతెన ప్రమాదంలో తమ ప్రమేయం ఏం లేదని.. అది ‘గాడ్‌ విల్‌’(దైవ నిర్ణయం) అని దీపక్‌ కోర్టుకు తెలిపారు. ఇలాంటి దురదృష్ట ఘటన జరగకుండా ఉండాల్సిందని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎంజే ఖాన్‌ ముందు దీపక్‌ విన్నపించారు. విచారణ అనంతరం నలుగురు నిందితులను కోర్టు నలుగురికి కోర్టు పోలీస్‌ కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా అయిదుగురికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

మచ్చు నదిపై కూలిన తీగల వంతెన దుర్ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. దీనిపై నవంబర్‌ 14న సర్వన్నోత న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటి వరకు 135 మంది మృతిచెందగా.. 170 మందిని కాపాడినట్లు గుజరాత్‌ మంత్రి రాజేంద్ర త్రివేది వెల్లడించారు. మచ్చునదిలో ఇంకా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఘటనలో కంపెనీకి చెందిన 9 మందిని అరెస్టు చేయగా..  కంపెనీ ఎగ్జిక్యూటివ్స్‌, ఇతర అధికారులు పత్తా లేకుండా పోయారు.
చదవండి: కేబుల్‌ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా?

మరిన్ని వార్తలు