Amritpal Singh: పంజాబ్‌ వదిలి పారిపోయిన అమృత్‌పాల్‌ సింగ్‌?

21 Mar, 2023 10:35 IST|Sakshi

ఖలిస్థాన్‌ వేర్పాటువాది, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు గత నాలుగు రోజులుగా భారీ స్థాయిలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నా. నేటీకి అతని ఆచూకీ లభించడం లేదు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు.  దీంతో పంజాబ్‌ వ్యాప్తంగా హై అలర్ట్‌ కొనసాగుతోంది.

తాజాగా అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌ సరిహద్దులు దాటి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఓ పాడుబడ్డ కారులో అతని దుస్తులు లభించడంతో పోలీసులు ఈ విధంగా భావిస్తున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌ మెర్సిడెస్‌ నుంచి దిగి బ్రెజా కారులో షాకోట్‌కు పారిపోయాడని పోలీసులు తెలిపారు. అనతరం ఖలీస్తానీ వేర్పాటువాదీ తన బట్టలు మార్చుకొని తన మద్దతుదారులకు చెందిన బైక్‌పై పంజాబ్‌ వదిలి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

ఈ మేరకు అమృతపాల్ సింగ్ దుస్తులు, బ్రెజ్జా కారు, మరికొన్ని కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు పారిపోవడానికి సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వందమందికి పైగా అతని సహచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి  నుంచి ‘ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌’ (ఏకెఎఫ్‌) కోసం ఉపయోగిస్తున్న అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని  స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: కోర్టులో పారదర్శకత ముఖ్యం.. ఏమిటీ సీల్డ్‌ కవర్‌ సంస్కృతి?: సుప్రీం కోర్టు

అలాగే అమృత్‌పాల్‌ మామ హర్జీత్‌ సింగ్‌, డ్రైవర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ జలంధర్‌లో పోలీసులకు లొంగిపోయారు. వీరి కారును పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఖలిస్తాన్‌ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందన్న అనుమానాలు  బలపడుతున్నాయి. మరోవైపు పంజాబ్‌లో శనివారం నుంచి మూతపడిన ఇంటర్నెట్‌ సేవలు నేడు(మంగళవారం)పాక్షింగా పునరుద్ధరించనున్నారు.

కాగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్‌, కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయిన అత్యంత సన్నిహతుడిని విడిపించుకునేందుకు తన మద్దతుతారులతో కలిసి అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసినప్పటి నుంచి ఈ పరిణామం తీవ్రరూపం దాల్చింది. డీ–ఎడిక్షన్‌ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్‌ తన అడ్డాగా చేసుకొని కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఖలిస్తాన్‌ 2.0

మరిన్ని వార్తలు