Mumbai: ట్రాఫిక్‌ ఉల్లంఘనల్లో రికార్డు.. ఒకే రోజులో 40 వేలకుపైగా కేసులు

6 Jun, 2022 13:36 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించే వాహన చోదకులకు ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్‌ విభాగపు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. అందులో శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 12 గంటలపాటు చేపట్టిన డ్రైవ్‌లో వివిధ ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘిస్తూ దాదాపు 40 వేలకుపైగా వాహన చోదకులు పట్టుబడ్డారు. ఇందులో అత్యధికంగా అంటే 10,957 కేసులు హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నవారివే. లాక్‌డౌన్‌ కాలంలో ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలక్రమేణా అది డ్రైవర్లకు ఒక అలవాటుగా మారింది.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో వాహనాలు యథావిధిగా రోడ్లపై నడుస్తున్నాయి. కానీ అలవాటు ప్రకారం ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించడంతో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ శాఖ, రీజినల్‌ పోలీసులు, దాదర్‌ నాయ్‌గావ్‌లోని సాయుధ విభాగ పోలీసులు, అధికారులు, కానిస్టేబుళ్లు ఇలా 255 మంది అధికారులు, 1,842 మంది కానిస్టేబుళ్లు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అందులో ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించిన 40,320 వాహన చోదకులను పట్టుకుని కేసులు నమోదు చేశారని ట్రాఫిక్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రాజ్‌ తిలక్‌ రోషన్‌ తెలిపారు.  
చదవండి: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు రెండోసారి కరోనా

మరిన్ని వార్తలు