మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు

22 Feb, 2021 15:13 IST|Sakshi

మహారాష్ట్రలో పెరుగుతున్న  కరోనా కేసులు

సరిహద్దు జిల్లా కావడంతో ఆందోళన

జిల్లా నుంచి నిత్యం మహారాష్ట్రకు రాకపోకలు

అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

కోవిడ్‌ నిబంధనలు పాటించకుంటే ఇబ్బందులే.. 

ఇప్పుడిప్పుడే జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి మళ్లీ ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాకు మహారాష్ట్ర ఆనుకొని ఉండడం, అక్కడ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఈ భయం స్థానికుల్లో ఎక్కువైంది.  జిల్లా నుంచి పలువురు వ్యాపార, తదితర పనుల నిమిత్తం నిత్యం మహారాష్ట్రకు వెళ్తూ వస్తుంటారు. అక్కడి వారు సైతం నిత్యం జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదు. గతంలో ప్రజలు భౌతికదూరం పాటిస్తూ మాసు్కలు ధరించగా, ప్రస్తుతం నిబంధనలు గాలికి వదిలేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆదిలాబాద్‌ ‌: జిల్లాకు మహారాష్ట్ర నుంచి కరోనా ముప్పు పొంచి ఉన్న  నేపథ్యంలో వైద్యాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రకు ఆనుకొని జిల్లాలోని బేల, జైనథ్, తాంసి, తలమడుగు, భీంపూర్, సొనాల, బజార్‌హత్నూర్‌ మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్, నాగ్‌పూర్, చంద్రపూర్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఆయా గ్రామాలు మహారాష్ట్రకు ఆనుకొని ఉండడంతో వారినుంచి వైరస్‌ వ్యాపిస్తే జిల్లాలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రకు నిత్యం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల రైళ్లను కూడా ప్రారంభించారు. మహారాష్ట్రకు సంబంధించిన రైలు ఆదిలాబాద్‌ మీదుగా వెళ్తుంది.అదేవిధంగా ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మహారాష్ట్రకు, అక్కడి నుంచి బస్సులు సైతం తిరుగుతున్నాయి. 

అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ..
మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. మెడికల్‌ ఆఫీసర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన విలేజ్‌ కమిటీలను అప్రమత్తం చేశారు. ఈ కమిటీలో ఆశా, ఏఎన్‌ఎం, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. గ్రామాలకు కొత్తవారెవరైనా వస్తే అప్రమత్తంగా ఉండేలా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలను తెలుసుకోవాలని చెబుతున్నారు. మహారాష్ట్రకు వెళ్లి వచ్చినవారికి దగ్గు, జలుబు, కరోనా లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు నిర్వహించి వెంటనే వైద్యం అందించేలా చూడాలని పేర్కొంటున్నారు. బేల, గిమ్మ, జైనథ్, భీంపూర్, తాంసి, తలమడుగు, సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అప్రమత్తంగా ఉన్నాం
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మాసు్కలు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. జిల్లాలో రెండుమూడు నెలల నుంచి పది లోపు కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రకు వెళ్లి వచ్చినవారు లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. 
– నరేందర్‌ రాథోడ్, డీఎంహెచ్‌వో

జిల్లాలో కరోనా కేసుల వివరాలు..

మొత్తం కోవిడ్‌ పరీక్షలు 2,03,716
పాజిటివ్‌ కేసులు  5130
నెగిటివ్‌ కేసులు 1,98,573
యాక్టివ్‌ కేసులు 114
కోలుకున్నవారు 4971
మృతిచెందిన వారు  45

మరిన్ని వార్తలు