సంపూర్ణ లాక్‌డౌన్‌: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్‌

7 Apr, 2021 17:32 IST|Sakshi

రాయ్‌పూర్‌: మహమ్మారి కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గడ్‌ ముందు స్థానంలో ఉంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు తీవ్రం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 19 వరకు మొత్తం బంద్‌ చేస్తున్నట్లు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు పది వేలకు చేరువగా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. 

మంగళవారం ఒక్కరోజే ఛత్తీస్‌గడ్‌లో 9,921 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిలో అత్యధికంగా రాజధాని రాయ్‌పూర్‌లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ వైద్య ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడి చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ దశలో రాజధానిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 14 వరకు రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు.  ఛత్తీస్‌గడ్‌లో మొత్తం కేసులు 3,86,269 ఉండగా వాటిలో యాక్టివ్‌ కేసులు 52,445 ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 4,416 మంది మృతి చెందారు.
చదవండి: మరో 3 రోజులకే టీకాలున్నాయన్న ఆరోగ్య మంత్రి
చదవండి: కోవిడ్‌ టీకాల కోసం పరుగులు.. మీరు క్యూలో ఉన్నారు!

మరిన్ని వార్తలు