ఇలపైనే భారీ ఉత్సవం ఈసారి నెల మాత్రమే

26 Mar, 2021 00:44 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగానది తీరాన నిర్వహించే కుంభమేళా ఈసారి నెల రోజులపాటు మాత్రమే కొనసాగనుంది. కోవిడ్‌–19 మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. కోవిడ్‌ ఆర్‌టీ–పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉన్న యాత్రికులనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 1న మొదలై 30వ తేదీతో ముగిసే ఈ ఉత్సవంలో ఏప్రిల్‌ 12, 14, 27వ తేదీల్లో షాహీస్నాన్‌ (ప్రధాన పుణ్య స్నానం) ఉంటాయని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేస్తారు.

దీంతోపాటు పుణ్య దినాలైన చైత్ర ప్రతిపాద (ఏప్రిల్‌ 13), శ్రీరామ నవమి (ఏప్రిల్‌ 21) రోజున భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 12 ఏళ్లకోసారి జరిగే కుంభ్‌ మేళా సాధారణంగా మూడున్నర నెలల పాటు కొనసాగుతుంది. 2010లో జనవరి 14న ప్రారంభమై ఏప్రిల్‌ 28వ తేదీన ముగిసింది. నెల రోజులపాటు మాత్రమే కుంభ్‌ జరగడం చరిత్రలో ఇదే మొదటిసారని అధికారులు చెప్పారు.

హరిద్వార్‌కు చేరుకునే ముందు 72 గంటల్లోపు పొందిన ఆర్‌టీ–పీసీఆర్‌ నెగెటిట్‌ సర్టిఫికెట్‌ను భక్తులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్న ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశాలను  అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సర్టిఫికెట్‌ను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. దేశంలో కోవిడ్‌  వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా కుంభ్‌ సమయంలో తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది.  

మరిన్ని వార్తలు