వేప చెట్టు కింద కరోనా మాత.. కూల్చివేతతో ఉద్రిక్తత

13 Jun, 2021 11:14 IST|Sakshi

మహమ్మారి కరోనాను దేవతగా భావించి పూజించడం మన దేశంలోనే సాధ్యమేమో. ఆ మధ్య తమిళనాడు కొయంబత్తూరులో కరోనా దేవి పేరుతో ఒక గుడి కట్టి పూజలు చేయడం చూశాం. అది మరువక ముందే యూపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే భూ కబ్జా నేపథ్యంలో ఆ గుడి కూల్చివేతతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

లక్నో: ప్రతాప్‌ఘడ్‌ శుకుల్‌పూర్‌ గ్రామంలో కొత్తగా ‘కరోనా మాత’ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఓ వేప చెట్టు కింద నిత్యం దేవతను పూజలు చేయడానికి ఒక పూజారిని సైతం నియమించారు. ‘కరోనా సోకకుండా చల్లగా చూడు తల్లీ’ అంటూ జనాలు పూజలు సైతం చేశారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ ఆలయం జాతీయ మీడియా ఛానెళ్ల దృష్టిని సైతం ఆకర్షించింది. అయితే నాలుగు రోజుల్లోనే కరోనా దేవి గుడి కథ ముగిసింది. శుక్రవారం రాత్రి ఎవరో ఆ గోడను కూల్చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది పోలీసుల పనే అని గ్రామస్తులు ఆరోపిస్తుండగా, ఆ గుడి వెలిసిన జాగ మీద వివాదం నడుస్తోందని, ఇది అవతలి వర్గం పనే అయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కరోనా దేవత శాంతింజేసేందుకు కొందరు జంతువుల్ని బలి ఇస్తున్నారు.

ఆక్రమణకు ప్లాన్‌?
ఆలయం నిర్మించిన స్థలం లోకేశ్‌ కుమార్‌, నగేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, జైప్రకాశ్‌ శ్రీవాస్తవ ఉమ్మడి ఆస్తి. లోకేష్‌ కుమార్‌ విరాళాలు వసూలు చేసి ఈ ప్రాంతంలో గుడి కట్టించాడు. కరోనా మాత పేరుతో మాస్క్‌ కట్టిన దేవతామూర్తికి పూజలు మొదలుపెట్టించాడు. అయితే, ఆ తర్వాత లోకేశ్‌ కుమార్‌ నోయిడాకు వెళ్లిపోయాడు. ఇక ఆలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నగేశ్‌.. సంగీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని ఆక్రమించుకునేందుకే ఆలయాన్ని నిర్మించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు