264 మంది టీచర్లకు కరోనా

23 Nov, 2020 07:02 IST|Sakshi

ఉపాధ్యాయులకు పాజిటివ్‌ రావడంతో విద్యాశాఖ అప్రమత్తం 

8 నెలల అనంతరం నేటి నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు 

విద్యార్థులను పంపించడం తప్పనిసరేంకాదన్న మంత్రి ప్రాజక్త 

నాగ్‌పూర్, థానేల్లో స్కూళ్లు ప్రారంభించట్లేదని అధికారుల వెల్లడి

సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు చేస్తున్న పరీక్షలలో కేవలం మూడు ప్రాంతాల్లోనే 264 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దాటుతుందోనని విద్యాశాఖ అప్రమత్తమైంది. దీంతో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయా లేదా మళ్లీ ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే విషయంపై కొంత అయోమయం నెలకొంది. అయితే రాష్ట్ర ఉన్నత విద్యా, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రాజక్తా తాన్‌పురే మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు విద్యార్థులను పంపించడం తప్పనిసరేం కాదని వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను నవంబర్‌ 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయడం ప్రారంభమైంది.

అయితే ఈ పరీక్షల్లో 264 మంది టీచర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముఖ్యంగా షోలాపూర్‌ గ్రామీణ ప్రాంతంలో 178 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. నాసిక్‌ జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాగ్‌పూర్‌ జిల్లాలో 41 మందికి కరోనా సోకింది. ఇలా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో వందలాది మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు వెల్లడవడంతో విద్యాశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో ఇప్పటికే ముంబై, థానేలతోపాటు అనేక ప్రాంతాల్లో పాఠశాలలను మరి కొన్ని రోజులు మూసి ఉంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా పాఠశాలలను ఇప్పుడే తెరవద్దని ఈ సంవత్సరం మొత్తం ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలతోపాటు పలువురు విద్యా«ర్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.  (భారత్‌లో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసిందా? )

నాసిక్‌లో జనవరిలోనే పాఠశాలలు 
నాసిక్‌ జిల్లాలో 2021 జనవరి 4వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ అధ్యక్షతన నాసిక్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులకు చేసిన కోవిడ్‌ పరీక్షల్లో నాసిక్‌లో ఎనిమిది మందికి, గ్రామీణ ప్రాంతంలో 37 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు ప్రస్తుతం జిల్లాలో 2,556 మంది కరోనా రోగులున్నారు.  ఇలాంటి నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జనవరి 4వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

స్కూళ్లకు రావడం తప్పనిసరి కాదు: విద్యాశాఖ సహాయ మంత్రి ప్రాజక్తా తాన్‌పురే
నవంబర్‌ 23వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు రావడం తప్పనిసరికాదని రాష్ట్ర ఉన్నత విద్యా, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రాజక్తా తాన్‌పురే తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు తెరవడం కూడా తప్పనిసరేమి కాదని, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు నవంబర్‌ 23వ తేదీ నుంచి తెరవనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీపావళి పండుగ అనంతరం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో ముంబై, నవీముంబై, థానే, పుణేలతోపాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలు డిసెంబర్‌ నెల వరకు తెరవబోమని ప్రకటించాయి.    (కరోనా టీకాపై భారత్‌ ఆశలు.. తేల్చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌)

మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ పాఠశాలలు తెరువాలా..?  వద్దా..?  అనే విషయంపై స్థానిక పాలక సంస్థలదే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పాఠశాలలు తెరవకముందే ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించుకోవడం అనివార్యం చేసింది. దీంతో పరీక్షలు చేసుకున్న వందలాది మంది ఉపాధ్యాయులకు, సిబ్బందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. ఇలాంటి నేపథ్యంలో పాఠశాలలకు తమ పిల్లలను పంపే విషయంపై అనేక మంది నిరాకరిస్తుండగా మరి కొందరు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యాశాఖ సహాయక మంత్రి ప్రాజక్తా తాన్‌పురే పిల్లలను పాఠశాలలకు పంపించడం తప్పనిసరేమి కాదన్నారు. దీంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులల్లో కొంత అయోమయం తగ్గి ఊరట లభించింది. 

నాగ్‌పూర్‌లోనూ బంద్‌ 
నాగ్‌పూర్‌లోనూ డిసెంబర్‌ 13వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడుతారని నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిప్రాయపడ్డారు. దీంతో పాఠశాలలు మూసే ఉంచాలని కమిషనర్‌ నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు ఆదివారం సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశా రు. ఇప్పటి వరకు ముంబైతోపాటు థానే, పుణే ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, పన్వేల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, నవీముంబై, భివండీతోపాటు రెండు మున్సిపాలిటీల్లో డిసెంబర్‌ తర్వాతే పాఠశాలలు తెరవాలని ఆయా స్థానిక పాలక సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.     

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా