మొత్తం ఎన్ని కొత్త వర్షన్‌ కేసులంటే..

9 Jan, 2021 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త రకం కరోనా (స్ట్రెయిన్‌) కేసులు దేశంలో పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో వ్యాపించిన కొత్తరకం వైరస్‌ దేశంలో విస్తరిస్తోంది. కరోనా స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య దేశంలో శనివారానికి 90కి చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ బాధితులందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించింది. ఆ వైరస్‌ విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

కొత్త రకం వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. వారికి సంబంధించిన వారిని గుర్తించి అప్రమత్తం చేసి వారిని క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్రం రాష్ట్రాల సహకారంతో కొత్త వర్షన్‌ కేసులు పెరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అయితే ఇన్నాళ్ల పాటు బ్రిటన్‌ (యూకే)కు నిలిపివేసిన విమాన సేవలు శనివారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చిన వారందరూ విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు విదేశాల నుంచి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా మరికొన్ని దేశాల్లో వైరస్‌ కొత్త రూపంలో వెలుగులోకి వస్తోంది. మొన్న బ్రిటన్‌, నిన్న దక్షిణాఫ్రికా, నేడు అమెరికాలో కొత్త రకం వైరస్‌ వచ్చింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మళ్లీ కొన్ని దేశాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు వచ్చాయి. 

మరిన్ని వార్తలు