కోవిడ్‌ నిర్ధారణకు స్వాబ్‌ ఇస్తున్నారా? ఈ వీడియో చూడండి

7 May, 2021 12:39 IST|Sakshi

ముంబై: దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే, సరైన సమయంలో వైరస్‌ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే మరణాల రేటును తగ్గించొచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనికోసం లక్షణాలున్నవారంతా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడమే మార్గం అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచారు. ముఖ్యంగా కచ్చితమైన ఫలితాలను ఇచ్చే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చేస్తున్నారు.

ఇక దేశంలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడినందున అందరూ తప్పక మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే వైరస్‌ నియంత్రణకు మార్గం అని డాక్టర్లు, సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈక్రమంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో వాడే స్వాబ్‌ కలెక్టింగ్‌ స్టిక్స్‌కు సంబంధించి బయటపడ్డ ఓ వీడియో నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఉంది. 

వీడియో ప్రకారం.. మహరాష్ట్రలోని థానేకు చెందిన ఓ మురికి వాడలో ప్లాస్టిక్‌ గొట్టాలు (స్వాబ్‌ కలెక్టింగ్‌ స్టిక్స్‌) ఓ కుప్పగా పోసి పిల్లలు, మహిళలు కవర్లలో ప్యాక్‌ చేస్తున్నారు. అక్కడ ఒక్కరూ కూడా మాస్కు పెట్టుకోలేదు. సోషల్‌ డిస్టెన్స్‌ అన్నది లేనే లేదు. ఇక ఈ సమాచారం అందుకున్న ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, పోలీసులు దాడులు జరిపి పెద్ద ఎత్తున ప్యాకింగ్‌ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘1000 స్వాబ్‌ కలెక్టింగ్‌ స్టిక్స్‌ను ప్యాక్‌ చేసినందుకు కాంట్రాక్టర్‌ పిల్లలకు, మహిళలకు రూ.20 చొప్పున చెల్లిస్తున్నాడు. కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా ప్యాక్‌ చేయిస్తున్నందుకు, పిల్లలను పనిలో పెట్టుకున్నందుకు కాంట్రాక్టర్‌ పై చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. వీడియోను వీక్షించిన నెటిజన్లు ‘కోవిడ్‌ టెస్టులు దేవుడెరుగు.. ఇలాంటి వస్తువులను నమ్ముకుంటే వైరస్‌ బారిన పడటం ఖాయం’ అంటున్నారు. కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ప్లాస్టిక్‌ గొట్టాలు శుభ్రంగా ఉన్నాయో లేదో ఓసారి చెక్‌ చేసుకుంటే బెటర్‌ అని చెప్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు