‘అందరూ ఇలా చేస్తే సెకండ్‌ వేవ్‌ను అడ్డుకోవచ్చు’

13 Apr, 2021 06:01 IST|Sakshi

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా ప్రోత్సహించాలి

క్లాత్‌ మాస్క్‌ అయినా ఫరవాలేదు

మూడు, నాలుగు వారాల్లో అదుపులో సంక్రమణ రేటు

లాక్‌డౌన్‌ అవసరం లేదు

ఐసీఎంఆర్‌ నిపుణుడు నరేంద్ర కుమార్‌ అరోరా వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణ  కట్టడి  సాధ్యమే అని ఐసీఎంఆర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య  పెరుగుతోంది. కానీ గతంలో మాదిరిగా భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్‌–19 కోసం ఐసీఎంఆర్‌ ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌లోని ఆపరేషనల్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ అరోరా వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఏమాత్రంలేదని పేర్కొన్నారు. అంతేగాక సంక్రమణను అడ్డుకొనేందుకు వైరస్‌ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో, సూక్ష్మ స్థాయిలో కంటైన్మెంట్‌ జోన్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు.  అలాగే, మాస్క్‌ ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దుమ్ము నుంచి కాపాడుకొనేందుకు కండువాలు మొహానికి అడ్డంగా పెట్టుకోవడం, మహిళలు చున్నీల వంటి వస్త్రాలను ధరించడం ఆనవాయితీగా వస్తోందని, ఇలా కూడా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు.

ఇంతకుముందు కరోనా విషయంలో ప్రజల్లో చాలా భయం ఉండేది. పండ్లు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తరువాత కనీసం ఐదారు గంటలు పక్కన పెట్టేవారు. అయితే నెమ్మదిగా ప్రజల్లో కరోనా భయం పోయిందని, కరోనాను నివారించడానికి ప్రజల్లో కనీసం ఉండాల్సిన భయం తప్పనిసరి అని డాక్టర్‌ నరేంద్ర కుమార్‌  పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు కచ్చితంగా ఉపయోగించడం కొనసాగిస్తే, కరోనా సెకండ్‌ వేవ్‌ మూడు, నాలుగు వారాల్లో ఆగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నగరాల్లో  ఉద్యోగులు ఆఫీసుల్లో ఒకచోట కలిసి కూర్చొనే పరిస్థితుల్లో, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు సైతం తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలనిన్నారు.  కేవలం ఎన్‌–95 మాస్క్‌లు మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న క్లాత్‌ మాస్క్‌లను అయినా వాడుకోవచ్చన్నారు.  మాస్క్‌లను ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్‌ వాడటం దైనందిన జీవితంలో భాగం కావాలని తెలిపారు.   

మరిన్ని వార్తలు