కరోనా కేసులు పైపైకి.. రాష్ట్రాలతో ఇవాళ కేంద్రం సమీక్షా సమావేశం

27 Mar, 2023 10:20 IST|Sakshi

ఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే హైఅలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో..  నేడు(సోమవారం, మార్చి 27న) రాష్ట్రాలతో కోవిడ్‌పై సమీక్షా సమావేశం నిర్వహింనుంది. వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా జరిగే సమీక్షలో రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనుంది.

కరోనా మరోసారి విజృంభణ దిశగా సంకేతాలు ఇస్తోంది. కొత్త కేసులు నానాటికీ పెరుగుతున్నాయి.  కొత్త కేసులు.. రెండు వేల మార్క్‌ చేరికకు దగ్గరయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా పది వేల దాకా చేరుకుంది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడులో క్రియాశీలక కేసులు ఎక్కువగా కనిపిస్తుండడంతో..   పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. యూపీలోనూ తాజాగా ఒక్కసారిగా కేసుల్లోపెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. కరోనా కేసులపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లు అప్రమత్తం అయ్యాయి కూడా. 

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మధ్య నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిబంధనల  ప్రకారం చూసుకుంటే వైరస్‌ విజృంభణ చాలా తక్కువగా ఉందని కేంద్రం అంటోంది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో వైరస్‌ విజృంభణను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలకు సూచించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఏప్రిల్‌ 10,11వ తేదీల్లో కరోనాపై నిర్వహించాల్సిన మాక్‌ డ్రిల్‌ గురించీ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ హాట్‌స్పాట్‌లను గుర్తించి, వైరస్‌ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్రాలకు  కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది కూడా. 
 
ఇక కొవిడ్,ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరగడం కూడా ప్రజల్లో గందరగోళానికి, లక్షణాలు ఒకేలా ఉండడంతో అయోమయానికి దారి తీస్తోంది. అయితే.. వైరస్‌ను ఎదుర్కొనేందుకు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలివెలుతురు సరిగా ఉండేలా చూసుకోవడం లాంటి చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తోంది. 

వీడియో: ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విధించండి సార్‌!

మరిన్ని వార్తలు