వచ్చే మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ 

20 Sep, 2020 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోవిడ్‌19 వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఐ) అనుమతించినట్లు మంత్రి చెప్పారు. అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్‌, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, అరవిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నట్లు తెలిపారు. ( వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ సీపీ మద్దతు )

ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరో 30 వరకు వ్యాక్సిన్‌ పరిశోధనలకు సాయపడుతున్నట్లు చెప్పారు. కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని, సెప్టెంబర్‌ 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు 85,499 మందికి కోవిడ్‌ 19 టెస్టులు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. అలాగే కోవిడ్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌, హెల్త్‌ సిస్టమ్‌ ప్యాకేజీ కింద రెండు దశలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ దాదాపు 200 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు