వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌

25 Jan, 2021 16:40 IST|Sakshi

అత్యధిక వ్యాక్సిన్‌ డోసులుతో, అంతర్జాతీయ రికార్డు 

వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన వారం రోజుల్లో 12 లక్షల డోసులు 

పొరుగు దేశాలకూ ఉచిత వ్యాక్సిన్‌ సరఫరా 

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారిని తరిమికట్టడంలో ప్రపంచదేశాలతో భారత్‌ పోటీపడుతోంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనదేశం తొలి పది దేశాల సరసన నిలిచింది. ప్రజలకు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులను వేసి, అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్‌ ఆవిష్కరించిన తొలివారం రోజుల్లోనే కోవిడ్‌–19 వ్యాప్తని అడ్డుకునేందుకు 12 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. మన దేశ ప్రజలకు వి్రస్తుతంగా టీకా పంపిణీ చేయడమే కాదు. నేపాల్, బాంగ్లాదేశ్, బ్రెజిల్, మొరాకోలతో సహా అనేక ఇతర దేశాలకు సైతం కోవిడ్‌ వ్యాక్సిన్‌ని సరఫరా చేయడంలో భారత్‌ ముందుంది.  

వారం రోజుల్లో 12 లక్షల డోసులు 
భారత్‌లో జనవరి 16న తొలుత ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకు 12 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. ఈ లెక్కన సరాసరి రోజుకి 1.8 లక్షల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. తొలి రోజు 2 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. ఆ తరువాత శుక్రవారం సాయంత్రానికి 10.4 లక్షలకు పైగా మంది పౌరులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, డ్రైరన్‌ నిర్వహణను ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిస్టం ద్వారా పర్యవేక్షించడం ఈ చారిత్రాత్మక కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఎంతగానో ఉపకరించింది. దాదాపు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.  

భారత్‌లో రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి     
భారత దేశం రెండు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లకు అనుమతిచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనికా అభివృద్ధిపరుస్తోన్న కోవిడ్‌–19 వ్యాక్సిప్‌ని కోవిషీల్డ్‌ అనిపిలుస్తున్నారు. దీన్ని పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఔషధ దిగ్గజ కంపెనీ తయారు చేస్తోంది. ఇక భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం పొందిన మరో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తోన్న కోవాగ్జిన్‌.

తొలి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ భారత్‌ లక్ష్యం 
ప్రభుత్వం తొలుత 1.1 కోట్ల కోవిషీల్డ్‌ డోసులను, 0.55 కోట్ల కోవాగ్జిన్‌ డోసులను కొనుగోలు చేసింది. తొలి దశలో ఆగస్టు 2021 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ముందుగా పోలీసులు, సైనికుల్లాంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో సహా ఒక కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ వేయాలని భావించింది. రెండో దశలో 50 ఏళ్ళు దాటిన 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ఇస్తారు. అనేక ఇతర దేశాలు సైతం భారత్‌లో చవకగా దొరుకుతోన్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత దేశం కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన దేశాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. కోవిడ్‌తో అత్యధికంగా సతమతమైన దేశం అమెరికా. ఆ తరువాతి స్థానం మన దేశానిది. ప్రస్తుతం మన దేశంలో తాజాగా నమోదౌతోన్న కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి 22 వరకు గతవారంలో భారతదేశంలో రోజుకి 14,000 కొత్త కరోనా కేసులు నమోదౌతూ వచ్చాయి.  

అంతర్జాతీయంగా 53 దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 
ప్రపంచవ్యాప్తంగా ఈ చారిత్రాత్మక వ్యాక్సినేషన్‌ ప్రక్రియని చాలా దేశాల్లో ప్రారంభించారు. జనవరి 22, 2021 వరకు ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో 5.7 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. భారత్‌నుంచి నేపాల్, భూటాన్, బాంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలు సహా బ్రెజిల్, దక్షిణాఫ్రికా, గల్ఫ్‌ లాంటి పొరుగు దేశాలకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు ప్రజలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రాధాన్యతను పదే పదే తెలియజేస్తూ, చైతన్య పరుస్తున్నారు. కోవిడ్‌ –19 టీకా వేయించుకునేందుకు ప్రజలను సంసిద్ధం చేస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, మన వైద్యులు, నర్సులను టీకా వేయించుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం తరఫున కోరుతున్నాను. ఎందుకంటే ఈ మహమ్మారి రాబోయే కాలంలో ఏ రూపు తీసుకుంటుందో తెలియదు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది’’అని నీతీ ఆయోగ్‌ సభ్యులు వికె.పాల్‌ తెలిపారు. 

భారత్‌ వ్యాక్సిన్‌ మైత్రిని కొనియాడుతోన్న ప్రపంచ దేశాలు 
కోవిడ్‌–19కి వ్యతిరేకంగా ‘సంజీవని బూతి’ని పంపారంటూ హనుమంతుడి ఫొటోను పోస్ట్‌ చేస్తూ, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ నుంచి కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ని అందుకున్న ఆరు దేశాల్లో భూటాన్, మాల్దీవ్స్‌ మొదటి స్థానంలో ఉన్నాయి. భారత దేశం కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ వాణిజ్య సరఫరాని కూడా ప్రారంభించింది.   

మరిన్ని వార్తలు