ముంబై: మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు 

15 Apr, 2021 16:11 IST|Sakshi

కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారుల యోచన

అధికారులు అడిగితే రైల్వే కోచ్‌లు కేటాయిస్తామన్న రైల్వే విభాగం

ముంబై సెంట్రల్‌: ముంబైలో పెరుగుతున్న కరోనా రోగుల వల్ల ఆసుపత్రులు, కరోనా కేర్‌ సెంటర్‌లలో పడకల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో రైల్వేలో సిద్ధంగా ఉన్న కోవిడ్‌ కేర్‌ కోచ్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం కోవిడ్‌ రోగులు పెరిగినప్పుడు రైల్వే బోర్డు అదేశాల ప్రకారం మొత్తం 17 జోన్లలో దాదాపు 5 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చివేశారు.

ముంబై సెంట్రల్, వెస్ట్రన్‌ రైల్వేలు కూడా పెద్ద సంఖ్యలో రైలు కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా తీర్చిదిద్దాయి. మధ్య రైల్వే దాదాపు రూ.3.80 కోట్ల వ్యయంతో 482 కోచ్‌లను కోవిడ్‌ కేర్‌ కోచ్‌లుగా బదలాయించాయి. పశ్చిమ రైల్వే కూడా సుమారు రూ.2 కోట్లు వ్యయం చేసి 410 కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాయి. తదుపరి కరోనా తీవ్రత తగ్గడం వల్ల క్రమక్రమంగా ఈ కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చివేశారు. ఇప్పటికీ కొన్ని కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఆదివాసి బహుళ ప్రాంతమైన నందూర్బార్‌ జిల్లాలో ప్రప్రథమంగా రైల్వే కోవిడ్‌ కేర్‌ కోచ్‌లను ఉపయోగించారు.

అత్యవసర వినియోగానికి 128 కోచ్‌లు.. 
ముంబై డివిజన్‌లో ఇప్పటికీ 128 కోచ్‌లు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి సకల సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాయని, వీటిని ఐసోలేషన్‌ వార్డులుగా ఉపయోగించుకోవచ్చని పశ్చిమ రైల్వే సీపీఆర్‌వో సుమీత్‌ ఠాకూర్‌ అన్నారు. ఒకవేళ వైద్య విభాగం, రైల్వే మంత్రిత్వ శాఖలు అదేశాలు ఇస్తే ముంబైతో పాటు అన్ని డివిజన్‌లలో అత్యవసర పరిస్థితుల్లో రైల్వే కోచ్‌లను ఐసోలేషన్‌ పడకలుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెంట్రల్‌ రైల్వే సీపీఆర్‌ఓ శివాజీ సుతార్‌ తెలిపారు. 

గతంలో ఐసోలేషన్‌ వార్డులుగా మార్చిన కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చి ప్రయాణాలకు ఉపయోగించామని, మళ్ళీ రైల్వే కోవిడ్‌ కోచ్‌లుగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని శివాజీ సుతార్‌ తెలిపారు. అయితే, ముంబైలో రైల్వే ద్వారా తయారు చేసిన రైల్వే కోవిడ్‌ కోచ్‌లను గతంలో కూడా వినియోగించలేదని ఇప్పుడు కూడా ఎలాంటి ప్రస్తావన రాలేదని సెంట్రల్‌–వెస్టర్న్‌ రైల్వే అధికారులు అన్నారు. ముంబైలో ప్రధానంగా ఎమ్‌ఎమ్‌ఆర్‌ ప్రాంతంలో పెరుగుతున్న కరోనా రోగులతో అసుపత్రులు నిండిపోతున్న నేపథ్యంలో రైల్వే కోవిడ్‌ కేర్‌ కోచ్‌ల అవసరం పడొచ్చు. మెడికల్‌ పరికరాలతో యుక్తమైన జనరల్, స్లీపర్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చే అవకాశం ఉంది. ఒక కోచ్‌లో 16 పడకల్ని ఏర్పాటు చేయవచ్చని అధికారులు తెలిపారు.

ఇక్కడ చదవండి:
ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా చంపేయండి‌

కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు

>
మరిన్ని వార్తలు