సంక్షోభంలోనే ఇది ‘సంక్షోభం’

25 Aug, 2020 13:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంవత్సరంలో అంతా మారిపోయింది. 2019 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వలసపోయిన వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. వారి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో లాభ పడింది. వలస కార్మికుల ద్వారా ఒక్క కేరళ రాష్ట్రానికి ఏటా 15000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కరోనా మహమ్మారి వల్ల అంతా తల కిందులయింది. లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. ఉపాధీ పోయింది. ప్రయాణ ఆంక్షలు, వీసా చిక్కులు వచ్చాయి. పర్యాటకులు చిక్కుకు పోయారు. విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం అయింది. భారత్‌ నుంచే కాకుండా పలు దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్లిన కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పొట్టన చేత పట్టుకొని ఆతిథ్య దేశంలో ఏ మాత్రం బతకలేక కోట్లాది మంది వలస కార్మికులు మాతృ దేశాలకు తిరిగి వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. ఉపాధి అవకాశాలు లేవు. నిరుద్యోగం వెక్కిరిస్తోంది. దారిద్య్రం మండుతోంది. ఈ పరిస్థితినే అంతర్జాతీయ కార్మిక సంస్థ ‘సంక్షోభంలో సంక్షోభం’గా అభివర్ణిస్తోంది. 2021 సంవత్సరం దాకా ఇదే పరిస్థితి తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతుండగా, ఆ తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగక తప్పదని విద్యావేత్తల అంచనాలు తెలియజేస్తున్నాయి. (చదవండి: 24 గంటల్లో.. 60,975 కరోనా కేసులు)

1970వ దశకం నుంచి భారత్‌ నుంచి వలసలు పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆసియా దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు వలసలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో గల్ఫ్‌ దేశాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఒక్కసారిగా ఊపందుకోవడంతో ఆ దేశాలకు వలసలు పెరిగాయి. 1980 సంవత్సరం నాటికి గల్ఫ్‌ దేశాలకు వలసపోయిన ప్రపంచ వలస కార్మికుల్లో 19 శాతం మంది భారత్, పాకిస్థాన్‌ దేశాల నుంచి వెళ్లిన వారేనని సైరాక్యూస్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ప్రేమ కురియన్‌ 1990 నుంచి 2019 మధ్య ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల వలసలు మూడింతలు పెరిగాయి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1.75 కోట్ల మంది భారతీయులు స్థిరపడ్డారు. పర్శియన్‌ గల్ఫ్‌లోని సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఖతార్, బహిరేన్, ఓమన్‌ కువైట్‌....ఆరు దేశాల్లోనే 80 లక్షల నుంచి 90 లక్షల వరకు భారతీయ కార్మికులున్నారు.  వారిలో యాభై శాతం మంది కార్మికులు నైపుణ్యంలేని వారుకాగా, 30 శాతం సగం నైపుణ్యం, మిగతా 20 శాతం మంది పూర్తి నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో లాక్‌డౌన్‌లు విధించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లక్షలాది మంది భారతీయ వలస కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆతిథ్య దేశంలో బతకలేక, మాతృదేశానికి రాలేక ఇక్కట్ల పాలయ్యారు. వారిని తీసుకరావడం కోసం భారత ప్రభుత్వం ‘వందే భారత్‌’ మిషన్‌ కింద ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆ మిషన్‌ కింద 8,78,000 మంది భారతీయులను మాత్రమే వెనక్కి తీసుకరాగలిగింది. ఈ ఏడాది మరో 20 లక్షల మందిని లేదా గరిష్టంగా 30 లక్షల మంది భారతీయ వలస కార్మికులను మాత్రమే భారత ప్రభుత్వం వెనక్కి తీసుకరాగలదని, ఆ తర్వాత కరోనా వైరస్‌ తీవ్రతపై మిగిలిన భారతీయ కార్మికుల రాక ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరమే!(చదవండి: జర్నలిస్ట్‌లపై విరుచుకుపడిన బ్రెజిల్‌ అధ్యక్షుడు)

మరిన్ని వార్తలు