కరోనా అలర్ట్‌: మహా ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్‌ మస్ట్‌!

4 Jun, 2022 12:16 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మరోసారి తన ఉనికిని చాటుతోంది. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతున్న కేసుల్లో పెరుగుదల ఊగిసలాట కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది.

ఇదిలా ఉంటే.. శనివారం కేంద్రం విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 3,962 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 26 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. తాజాగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ముంబై నుంచే అధికంగా కేసులు వస్తున్నాయి. ఈ తరుణంలో.. అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో మాస్క్‌ తప్పనిసరిని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు అదనపు సీఎస్‌ డాక్టర్‌ ప్రదీప్‌ వ్యాస్‌.. జిల్లా అధికారులకు ఉత్తర్వులు పంపించారు. రైళ్లు, బస్సులు, సినిమా హాల్స్‌, ఆడిటోరియమ్స్‌, ఆఫీసులు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూల్స్‌.. ఇలా క్లోజ్డ్‌గా ఉండే పబ్లిక్‌ ప్లేసుల్లో మాస్క్‌ తప్పనిసరి అని ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే బహిరంగ ప్రాంతాల్లో మాత్రం మాస్క్‌ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మాస్క్‌ స్వచ్ఛందంగా ధరించాలంటూ సీఎం ఉద్దవ్‌ థాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 2,697 మంది కరోనా నుంచి కోలుకోగా... 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో యాక్టివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కరోనా ఉదృతి ఉన్నప్పటికీ.. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. 

తాజా కరోనా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,72,547కి చేరుకున్నాయి. మొత్తం 4,26,25,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా 26 మరణాలతో.. ఇప్పటి వరకు 5,24,677 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా, క్రియాశీల రేటు 0.05 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,93,96,47,071 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 11,67,037 మంది వ్యాక్సినేషనల్‌లో పాల్గొన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ.. శుక్రవారం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెరుగుతున్న కోవిడ్ కేసులు, పాజిటివిటీ రేటుపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ..  మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖలు రాసింది. వైరస్‌ కట్టడికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

చదవండి: భారత్‌లో మంకీపాక్స్‌ కలకలం

మరిన్ని వార్తలు