ఎనిమిదో రోజూ 50వేల కేసులు

7 Aug, 2020 05:19 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ లో గురువారం కొత్తగా 56,282 కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,64,536 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46,121 మంది కోలుకోగా, 904 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 40,699 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 13,28,336కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,95,501 గా ఉంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 30.31గా ఉంది. ఇది జూలై 24న 34.17గా ఉండేది. గత ఎనిమిది రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజా 904 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 334 మంది మరణించారు. తమిళనాడు నుంచి 112, కర్ణాటక నుంచి 100, పశ్చిమబెంగాల్‌ నుంచి 61, ఉత్తర ప్రదేశ్‌ నుంచి 40 మంది మరణించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 67.62 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.07 శాతానికి పడిపోయిందని తెలిపింది.

కోవిడ్‌ కోసం 890 కోట్ల నిధులు..
కోవిడ్‌ ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు సాయంచేసేందుకు గురువారం కరోనా అత్యవసర నిధి రెండో విడతలో భాగంగా రూ. 890.32 కోట్లు విడుదల చేసింది. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవి కేటాయించనున్నారు. రాష్ట్రాల్లోని కేసుల ఆధారంగా నిధులను కేటాయించనున్నారు. కోవిడ్‌ ను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ రూ. 15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను వైద్య రంగ మౌలిక వసతులను మెరుగుపరచుకోవడానికి రాష్ట్రాలు ఉపయోగించుకోనున్నాయి. ఈ పాకేజీలో భాగంగా రాష్ట్రాలు 5,80,342 ఐసోలేషన్‌ బెడ్లు, 1,36,068 ఆక్సీజన్‌ సపోర్టెడ్‌ బెడ్లు పొందనున్నాయి.

మరిన్ని వార్తలు