ఢిల్లీలో కరోనా విజృంభణ

23 Nov, 2020 04:25 IST|Sakshi
ఢిల్లీ శ్మశానవాటికలో కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుటుంబసభ్యులు, ఆరోగ్య సిబ్బంది

చలి తీవ్రత, వాయు కాలుష్యంతో పెరుగుతున్న కేసులు

థర్డ్‌వేవ్‌ ఉందన్న సీఎం కేజ్రీవాల్‌

దేశమంతటా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కరోనా బెంబేలెత్తిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 100 మంది దాకా మృత్యువాత పడుతున్నారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 8,041 మందిని కరోనా వైరస్‌ బలి తీసుకుంది.  

న్యూఢిల్లీ: భారత్‌లో సెప్టెంబర్‌లో కరోనా వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరింది. అప్పటి నుంచి తీవ్రత తగ్గుతోంది. ఢిల్లీలో జూన్, సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 11న ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 8,593 కొత్త కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 18న ఒక్కరోజులోనే 131 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. నవంబర్‌ 19న  7,546 కొత్త కేసులు బయటపడ్డాయి, 98 మంది మరణించారు. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన మొత్తం మరణాల్లో 21 శాతం మరణాలు ఢిల్లీలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

రాజధానిలో థర్డ్‌ వేవ్‌
ఢిల్లీలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాస్కు ధరించని వారికి జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000కు పెంచేశారు. వివాహానికి 200 మంది అతిథులు హాజరుకావొచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నారు. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లను మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర హోం శాఖ సైతం రంగంలోకి దిగింది. నవంబర్‌ ఆఖరి వరకు ప్రతిరోజూ 60,000 ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వసతులు భారీగా పెంచాలని కోరింది.

పేదలే సమిధలు
రాజధానిలో ప్రధానంగా కనిపించేది అధిక జనాభా. కరోనా విస్తరణకు ఇదొక ముఖ్య కారణమన్నది నిపుణుల మాట. కరోనా వి జృంభిస్తున్నా పేదలు ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి లేదు. జీవనం కోసం బయటకు అడుగు పెట్టాల్సి వస్తోంది. ఢిల్లీలో ఇటీవల పేదలే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పనుల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్న పేదలకు కరోనా సోకుతోందని ప్రఖ్యాత ఎపిడెమాలజిస్టు డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియిల్‌ చెప్పారు. పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో జన సాంద్రత అధికంగా ఉండడం కరోనా వ్యాప్తికి అనుకూల పరిణామమే.

ఢిల్లీలోనే ఎందుకు?
దేశంలో అక్టోబర్, నవంబర్‌ నెలల్లో పండుగలు అధికంగా జరుగుతాయి. పండుగ సీజన్‌లో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ముందునుంచే హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా పండుగల సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఢిల్లీలోనే మహమ్మారి ఎందుకు పడగ విప్పుతోందన్న ప్రశ్నలకు నిపుణులు రకరకాల సమాధానాలు చెబుతున్నారు.

నగరం ఒక గ్యాస్‌ చాంబర్‌
ఢిల్లీలో చలికాలం ప్రారంభం కాగానే కాలుష్యం స్థాయి పెరిగిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తోంది. గాలి వేగం తగ్గిపోయింది. ఢిల్లీ నగరం ఒక గ్యాస్‌ చాంబర్‌లా మారిందని చెప్పొచ్చు. నగరంలో కరోనా కేసుల పెరుగుదలకు వాయు కాలుష్యం కూడా ఒక ముఖ్యమైన కారణం. దీనికి తోడు కరోనా నియంత్రణకు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ఇప్పుడున్న అతిపెద్ద ఔషధం అప్రమత్తతే.

వాతావరణం.. కాలుష్యం
ఢిల్లీలో చలికాలం అక్టోబర్‌ చివరి వారంలోనే ప్రవేశించింది. ఈ వాతావరణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇళ్లల్లో ఉండే కరోనా బాధితుల నుంచి వైరస్‌ ఇతరులకు సులభంగా వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. అలాగే కాలుష్యం కారణంగా గొంతు, ముక్కు, ఊపిరితిత్తులకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.  ఫలితంగా కరోనాతోపాటు ఇతర వైరస్‌లు సులభంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు