ఆస్పత్రుల్లో తగ్గుతున్న కరోనా మరణాలు

21 Oct, 2020 20:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ తీవ్రంగా ఉన్న అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలలతో పోలిస్తే కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరి మరణిస్తోన్న వారి సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. అప్పట్లో న్యూయార్క్‌లో కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలైన వారిలో దాదాపు 25.6 శాతం మంది మరణించగా, ఇప్పుడు వారి సంఖ్య 7.6 శాతానికి పడి పోయింది. బ్రిటన్‌లో కూడా కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరి మరణిస్తోన్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని, దాదాపు మూడింట రెండొంతులు తగ్గిందని మరో అధ్యయనం తెలియజేసింది. వృద్ధులు, పలు ఇతర వ్యాధులు ఉన్న వారు ఎక్కువగా ఇళ్లకు పరిమితం అవడం, యువతే ఎక్కువగా కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలవుతుండడంతో కోలుకునే వారి సంఖ్య పెరిగిందని వైద్య నిపుణలు తెలియజేశారు. తాజా అధ్యయనాల్లో కరోనా వైరస్‌ గురించి వైద్యులకు మరిన్ని విషయాలు తెలియడం, ప్రాణాలను పరిరక్షించడంలో ఔషధాల పాత్ర గురించి కూడా వైద్యులకు అవగాహన పెరగడం కూడా మరణాలను తగ్గించిందని పరిశోధకులు తేల్చారు. (చదవండి: ఏపీలో మరింత మెరుగ్గా కరోనా రికవరీ రేటు)

అయితే ఒక్క మార్చి నెల నుంచి మే నెల మధ్య కాలంలోనే ఇంగ్లండ్‌లో కరోనా మృతుల సంఖ్య 29 శాతం నుంచి పది శాతానికి పడి పోయినట్లు ఎక్స్‌టర్‌ మెడికల్‌ స్కూల్‌ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనంలో తేలింది. అలాగే ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లలో కరోనా మృతుల సంఖ్య గతంలో 30 శాతం ఉండగా, ఇప్పుడది 12 శాతానికి పడిపోయిందని ‘ది ఇంటెన్సివ్‌ కేర్‌ నేషనల్‌ ఆడిట్‌ అండ్‌ రీసర్చ్‌ సెంటర్‌’ వర్గాలు తెలిపాయి. భారత్‌ లాంటి వర్ధమాన దేశాల్లో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యతో  పాటు చేరాక మరణిస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే అది ఏ శాతం తగ్గిందో కచ్చితంగా తెలుసుకోవడానికి తాజా అధ్యయనాలు అవసరం. భారత్‌లో సహస్రాబ్దులు అంటే, యువత ఎక్కువ ఉన్నందున వారు కరోనా బారిన పడి కూడా కోలుకుంటున్నారని ఇంతకుముందో అధ్యయనం వెల్లడించింది. (చదవండి: ‘మాస్కు’లతో మరో ప్రమాదం)

మరిన్ని వార్తలు