Coronavirus: ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు..! 

26 May, 2021 07:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు. కరోనా తల్లిని మింగేయడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ముక్కు పచ్చలారని వయసులో తల్లిదండ్రులను కోల్పోయి సాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారంతో వారిని ఆదుకుంటామని ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణ్యం ప్రకటించారు. కరోనా అనేక కుటుంబాలను కష్టాల కడలిలో ముంచేస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ పెద్దలను కోల్పోయి  ఎన్నో కుటుంబాలు కన్నీటి మడుగులో మునిగిపోయాయి. ముక్కు పచ్చలారని ముగ్గురు పిల్లలు అనాథలుగా మారడం తిరునల్వేలి జిల్లా ముడించి పట్టి గ్రామ వాసులను శోక సంద్రంలో ముంచింది. 

తొలుత తండ్రి.. 
ముడించిపట్టి తుత్తికులానికి చెందిన జప మాణిక్య రాజ్, జ్ఞానమరియ సెల్వి దంపతులకు కమారులు ధర్మరాజ్‌(9), స్టీఫన్‌ రాజ్‌(7),సెల్విన్‌(5) ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మాణిక్య రాజ్‌ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సెల్వి కష్టాన్ని గుర్తించిన స్థానిక అధికారులు అంగన్‌వాడీలో కాంట్రాక్టు ఉద్యోగాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో కరోనా బారిన పడిన సెల్వి రెండు రోజుల క్రితం మృతిచెందింది. తల్లిదండ్రులు లేకపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పిల్లలను వయో భారంతో ఉన్న నాన్నమ్మ మాసమ్మ తీసుకెళ్లి ఆలనాపాలన చూడాల్సిన పరిస్థితి.

సాయం కోసం..
తల్లిదండ్రుల పెళ్లి నాటి ఫొటోను చేతిలో ఉంచుకుని కన్నీటి పర్యంతం అవుతున్న ఈ పిల్లల విషయాన్ని తూత్తుకుడికి వచ్చిన ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం దృష్టికి ఓ మీడియా తీసుకెళ్లింది. సీఎం స్టాలిన్‌తో చర్చించి ప్రభుత్వ పరంగా, డీఎంకే పార్టీ పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అలాగే తిరునల్వేలి కలెక్టర్‌ విష్ణు స్పందిస్తూ.. వృద్ధురాలైన ఆ పిల్లల నానమ్మకు తక్షణం రూ. వెయ్యి పింఛన్‌ మంజూరయ్యే విధంగా ఆదేశించారు. ఇక, అరోరా అనే సంస్థకు చెందిన దివ్య భారతి కరోనా పరిస్థితులు తగ్గినానంతరం ఆ పిల్లలను కలుస్తామని, చదువుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
చదవండి: రెండున్నర ఎకరాల కోసం నలుగురు బలి 

మరిన్ని వార్తలు