కరోనా: ‘టీకా వేసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం’

23 Jun, 2021 12:43 IST|Sakshi

ఉజ్జయిని కలెక్టర్‌ ఆశీష్‌ సింగ్‌ కీలక నిర్ణయం

భోపాల్‌: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. అయితే పలు రాష్ట్రాలు కరోనా వాక్సినేషన్‌ డ్రైవ్‌లను పటిష్టంగా నిర్వహిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ప్రజలకు వ్యాకిన్‌ అందజేస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వాలు కోవిడ్‌ టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి వాక్సిన్‌ వేస్తున్నాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా​ పరిపాలన కార్యాయం కీలక నిర్ణయం​ తీసుకుంది. కరోనా వైరస్‌ టీకా వేయించుకున్న ప్రభుత్వ​ ఉద్యోగులకు మాత్రమే జూలై నెల జీతం అందజేయబడుతుందని పేర్కోంది. ఈ మేరకు ఉజ్జయని జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సింగ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జూలై 31 వరకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే జూలై నెల జీతం పంపిణీ చేయబడదని జిల్లా అధికారులు పేర్కొన్నారు.

ఇక కరోనా వాక్సిన్‌ వేయించుకున్నట్లు టీకా ధ్రువపత్రాలు అందజేయాలని తెలిపారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ నమోదు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఆశీష్‌ సింగ్‌ వెల్లడించారు. జూన్ నెలకు జీతాల పంపిణీతో పాటు టీకా సర్టిఫికేట్లను సేకరించాలని, కరోనా బారిన పడకుండా ప్రభుత్వ ఉద్యోగులు టీకాలు వేసుకుంటున్న సమాచారాన్ని సేకరించాలని జిల్లా ట్రెజరీ అధికారిని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్‌తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ చేసుకోనివారు కావటం గమనార్హం.
చదవండి: దేశంలో తగ్గిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు