యూపీలో మరో మూడు ఆర్‌టీ పీసీఆర్‌ ల్యాబ్‌లు

22 Sep, 2020 15:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో సైతం రోజురోజుకు అత్యంతగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 90 వేల మందికి పైగా బలిగొన్న కరోనాకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం, పరిశోధన సంస్థలు  తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో వైరస్‌ నివారణకు మూడు పరిశోధన సంస్థల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించి కుటుంబ సంక్షేమశాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు.

వెనుకబడిన ప్రతాప్‌ఘర్, జునాపుర్, బలియా జిల్లాల్లో పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. నెలాఖరు వరకు ఇవి సేవలు ప్రారంభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షలు మరింత పెంచాలని ముఖ్యంగా ఆర్‌టీ–పీసీఆర్‌ను పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఆరోగ్య శాఖను ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలోని 75 జిల్లాల్లో పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజూ 1.50 లక్షల సాంపిల్స్‌ సేకరిస్తున్నామని అందులో సుమారు 50 వేల సాంపిల్స్‌ ఆర్‌టీ–పీసీఆర్‌ యంత్రాల ద్వారా నిర్వహించామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 86.76 లక్షల పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గతంలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే టెస్టింగ్‌లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో మొత్తం 234 పరిశోధనాలయాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు 34 ప్రభుత్వ ఆర్‌టీ–పీసీఆర్, 10 ప్రభుత్వ ఆర్‌టీ–పీసీఆర్‌ పరిశోధనాలయాల సంస్థల సహాయంతో  రాష్ట్రంలో ప్రతిరోజూ 50 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్‌ కాలేజీలతో పాటు 9జిల్లాల్లో ఆర్‌టీ–పీసీఆర్‌ పరిశోధనాలయాలు ఏర్పాటు చేశామని అదేవిధంగా 99 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 70 ప్రైవేటు ఆసుపత్రులల్లో ట్రూ న్యాట్‌ల్యాబ్స్‌ ఏర్పాటు చేసి ప్రతిరోజూ 1.5 లక్షల వరకు టెస్టింగ్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు