ఢిల్లీలో 51 లక్షల మందికి టీకా

25 Dec, 2020 05:34 IST|Sakshi

స్వీకరణ, నిల్వ, సరఫరాకు సర్వం సిద్ధం

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  

న్యూఢిల్లీ: ఢిల్లీలో తొలి దశలో ప్రాధాన్యతల వారీగా 51 లక్షల మందికి కరోనా టీకా అందజేస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఆయన గురువారం వర్చువల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీకా స్వీకరణ, నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకా అందగానే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మూడు కేటగిరీల ప్రజలకు తొలుత వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 6 లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50 ఏళ్లకుపైగా వయసున్న, 50 ఏళ్లలోపు వయసుండి వ్యాధులతో బాధపడుతున్న 42 లక్షల మందికి తొలి దశలో వ్యాక్సిన్‌ అందజేస్తామని వివరించారు. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున మొత్తం 1.02 కోట్ల డోసులు ఇస్తామని పేర్కొన్నారు. .  

యూకే ప్రయాణికులపై నిషేధం: యూకే నుంచి తమ రాష్ట్రంలోకి ప్రయాణిలకు రాకపై మేçఘాలయ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యూకే నుంచి ఇటీవలి కాలంలో తమ రాష్ట్రానికి వచ్చిన వారి జాడ తెలియక ఉత్తరప్రదేశ్‌  అధికారులు హైరానా పడుతున్నారు. సదరు ప్రయాణికులు ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణం.     

కర్ణాటకలో నైట్‌ కర్ఫ్యూ లేదు..
సాక్షి, బెంగళూరు:  రాత్రిపూట కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే మనసు మార్చుకుంది. ప్రకటించిన 24 గంటల్లోనే కర్ఫ్యూను ఎత్తివేసింది. కరోనా వైరస్‌ కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో  9 రోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంది.

కరోనా రికవరీ రేటు 95.75%
దేశంలో కోవిడ్‌ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 96.93 లక్షలకు చేరుకోవడంతో రికవరీ రేటు 95.75%కి పెరిగిందని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే కొత్తగా 24,712 కరోనా కేసులు బయటపడటంతో ఇప్పటి వరకు వెల్లడైన మొత్తం కేసులు 1,01,23,778కు పెరిగినట్లు వెల్లడించింది. అదేవిధంగా, కోవిడ్‌తో మరో 312 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,46,756గా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 96,93,173కు చేరుకోవడంతో రికవరీ రేటు 95.75%, మరణాల రేటు 1.45%గా ఉంది. కరోనా యాక్టివ్‌ కేసులు 2,83,849 కాగా మొత్తం కేసుల్లో ఇవి 2.80%మాత్రమే.

మరిన్ని వార్తలు