పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగానికి రంగం సిద్ధం

30 Jun, 2022 06:06 IST|Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ53 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్‌ బుధవారం మొదలైంది. సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ–53 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.

ప్రయోగాల్లో పీఎస్‌ఎల్‌వీ టాప్‌
ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్‌ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి.

మరిన్ని వార్తలు