ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..'

2 Dec, 2021 07:28 IST|Sakshi
మందిరంలో వివాహం చేసుకుంటున్న ప్రేమికులు   

సాక్షి, జయపురం (ఒడిశా): పరస్పరం ప్రేమించుకొని, పెద్దల కాదనడంతో ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంటను ఒక్కటి చేశారు.. జయపురం మహిళా పోలీసులు. పెళ్లి పెద్దలుగా ఇరువురి కుటుంబాలను ఒప్పించి, స్థానిక బస్టాండ్‌ సమీపంలోని మందిరంలో బుధవారం వారి వివాహం జరిపించారు. జయపురం మహిళా పోలీసు స్టేషన్‌ అధికారి మమతా పాణిగ్రహి తెలిపిన వివరాల ప్రకారం... కందులగుడ గ్రామానికి చెందిన కృష్ణమాలి కుమార్తె గాయిత్రీ, కుంద్రా సమితి పుప్పుగాం పంచాయతీ జబాపాత్రోపుట్‌ గ్రామానికి చెందిన లోక్‌నాథ్‌ కందిలియా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ఎవరికీ చెప్పకుండా ఇరువురూ పరారయ్యారు.

చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..)

తన కుమార్తెను లోక్‌నాథ్‌ ఎత్తుకు పోయాడని యువతి తండ్రి జయపురం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు జరిపి, జబాపాత్రోపుట్‌లో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని వారు తెలుపగా.. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులే పెళ్లి పెద్దలుగా మారారు. ఇరువైపులా కుటుంబాలను పిలిచి, పరిస్థితి వివరించడంతో వారంతా సమ్మతించారు. ఈ నేపథ్యంలో ఉభయలకు మందిరంలో వివాహం జరిపించారు. వివాహం సమయంలో గాయత్రీ తండ్రి కృష్ణమాలి, తల్లి తులామాలి, లోక్‌నాథ్‌ తండ్రి వంశీధర కందలియా, తల్లి రాధామణి, బంధువులు, గ్రామపెద్దలు పాల్గున్నారు. వివాహం జరిపించిన పోలీసు అధికారులను ప్రశంసించారు. 

చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ)

మరిన్ని వార్తలు