రూ.62 వేలకు నలుగురు పిల్లల అమ్మకం.. రెండేళ్ల తర్వాత

15 Dec, 2021 17:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: కొందరి నిస్సహాయతని మరికొందరు అవకాశంగా మార్చుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలే బయట ప్రపంచంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ దంపతులకి మాయమాటలు చెప్పి వారి పిల్లలని విక్రయించి ఆ చిన్నారుల దగ్గర వెట్టి చాకిరి చేయించుకున్నాడు ఓ మేకల యజమాని. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ భాగోతం బయటపడింది.

వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఓ దంపతులు రెండేళ్ల క్రితం తమ నలుగురు పిల్లలను మేకల యజమాని గోవిందరాజన్‌కి రూ.62,000 మొత్తానికి విక్రయించారు. గోవిందరాజన్ ఆ దంపతులతో.. పేదరికంతో బాధపడుతున్న మీరు ఆర్థికంగా బాగుపడతారని హామీ ఇచ్చి వారి పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటానని నమ్మించి కొనుగోలు చేశాడు. కానీ ఆ చిన్నారుల చేత వెట్టి చాకిరి చేయించుకునే వాడు. 

మేకలకు మేత కోసం ఆ పసి వాళ్లని రోజుకు 10 కిలోమీటర్లకు పంపేవాడు. అంతటితో ఆగకుండా వారిని దుర్భాషలాడేవాడు. ఓ రోజు, మందలోని మేకలలో ఒకటి తప్పిపోయినందుకు ఆ పిల్లలని తీవ్రంగా హింసించాడు. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో ఆ నలుగురి పిల్లలకి ఆ వ్యక్తి నుంచి విముక్తి లభించింది. పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చుతామని స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
చదవండి: పెళ్లి ఊరేగింపులో అపశ్రుతి.. తృటిలో తప్పింది లేదంటే వరుడికి..

మరిన్ని వార్తలు