-

రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు.. షాకిచ్చిన కోర్టు.. ఏకంగా రూ. 65 వేలు చెల్లించాలని ఆదేశం

21 Jan, 2023 12:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: వినియోగదారుడికి రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు నష్టపరిహారంగా రూ. 65 వేలు అందజేయాలని వినియోగదారుల ఫోరంను కోర్టు ఆదేశించింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకంకు చెందిన నిర్మల్‌ కుమార్‌ చెన్నై సౌకార్‌పేట గోవిందప్పనాయకన్‌ వీధిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2018 జూలై 24న స్నేహితుడు అకౌంట్లో నగదు డిపాజిట్‌ చేశాడు. ఆ సమయంలో రూ. 900కు గాను రెండు 500 రూపాయల నోటును బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. చలానాలో రెండు 500 నోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.

బ్యాంక్‌ క్యాషియర్‌ రూ.900 లకు బదులుగా నిర్మల్‌ కుమార్‌ స్నేహితుడి ఎకౌంట్‌కు వెయ్యి రూపాయలు పంపించేశాడు. దీంతో నిర్మల్‌ కుమారు బ్యాంకు క్యాషియర్‌ వద్ద మిగిలిన రూ. 100 ఇవ్వమని కోరాడు. ఈ వ్యవహారాన్ని నిర్మల్‌ కుమార్‌ బ్యాంకు మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని తరువాత ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు కూడా చర్యలు తీసుకోలేదు. చివరిగా చెంగల్పట్టు వినియోగదారుల ఫోరం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల ఫోరం కోర్టు న్యాయమూర్తి బాధితుడికి నష్టపరిహారంగా రూ. 50 వేలు, కేసు దాఖలు చేయడానికి అయిన ఖర్చు రూ. 15 వేలు కలిపి మొత్తం రూ. 65 వేలు అందజేయాలని సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేశారు.    

మరిన్ని వార్తలు