వీడియో సీడీలంటేనే వణికిపోతున్న మంత్రులు

7 Mar, 2021 02:31 IST|Sakshi

కోర్టుల్లో ఆరుగురు కర్ణాటక మంత్రుల అర్జీ 

అనుమతి ఇచ్చిన కోర్టు

భగ్గుమంటున్న విపక్షాలు

సాక్షి, మైసూరు: కర్ణాటకలో వీడియో సీడీలంటేనే మంత్రులు వణికిపోతున్నారు. తమకు చెందిన సీడీలు ఏవైనా ఉంటే వాటిపై పత్రికలు, టీవీ చానెళ్లలో వార్తా ప్రసారాలు రాకుండా చూడాలని పలువురు అమాత్యులు బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్లను వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేశ్‌ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన పదవి పోవడం తెలిసిందే. సిటీ సివిల్‌ కోర్టు వెబ్‌సైట్లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది. 

భగ్గుమంటున్న విపక్ష నేతలు
మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అలా పిటిషన్లను వేసిన ఆరుమంది మంత్రులను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించాలని జేడీఎస్‌ ఎమ్మెల్యే. సా.రా. మహేష్‌ డిమాండు చేశారు. శనివారం మైసూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో ప్రసారం చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని ఆరుమంది మంత్రులు కోర్టును ఆశ్రయించారని, వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అన్నారు.

మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ వీడియోల గురించి డిమాండ్లు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు.  మీరు తప్పు చేయకుంటే కోర్టును ఎందుకు ఆశ్రయించారని మహేశ్‌ ప్రశ్నించారు. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ వీడియోలు బయటకి వస్తే మీ బండారం మొత్తం బయట పడుతుంది, అలా జరగకుండా కోర్టుకెళ్లారు అని ఆరోపించారు. ముంబైకి వెళ్ళిన మంత్రులు అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఎద్దేవా చేశారు. పలువురు ప్రతిపక్ష నేతలు ఇదే తరహాలో ఆరోపణలు సంధించారు.  చదవండి: (రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?)

వారు కోర్టుకెళ్లడం సరికాదు: సదానందగౌడ
యశవంతపుర: తమ సీడీలను విడుదల చేయరాదని కొందరు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లడం సరికాదని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ అన్నారు. ఆయన శనివారం బెంగళూరు కేసీ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని విలేకర్లతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సమాచారం పంపించారు. మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేరళ సీఎంపై బంగారం స్మగ్లింగ్‌ వంటి బలమైన ఆరోపణలు వచ్చినందున ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు