మున్ముందు కోర్టు హాళ్లూ చిన్నవి అవుతాయి

28 Mar, 2021 06:09 IST|Sakshi

ఆధునిక సాంకేతికత పరిజ్ఞానమే కారణం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే

పణాజి: సాంకేతికత కారణంగా భవిష్యత్తులో కోర్టు ప్రాంగణాలు, కోర్టు గదులు కూడా చిన్నవిగా మారి పోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే తెలిపారు. న్యాయం అందించే విషయంలో కరోనా మహమ్మారి పలు సవాళ్లు విసిరినప్పటికీ, ఆ పరిణామం కోర్టుల నవీకరణకు బాటలు వేసిందని ఆయన తెలిపారు. శనివారం పోర్వోరిమ్‌లో ముంబై హైకోర్టు గోవా ధర్మాసనం కొత్త భవనం ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. ‘రవి శంకర్‌ ప్రసాద్‌ మంత్రిత్వం కారణంగానే కోర్టు గదులు చిన్నవిగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాను. అదేవిధంగా, భారీగా ఉండే కోర్టు పత్రాలను భద్రపరిచేందుకు చాలా గదులుండేవి. కానీ, ఈ–ఫైలింగ్, డేటా రాకతో ఇకపై పెద్ద సంఖ్యలో గదుల అవసరం కూడా ఉండదు.

ఈ విషయంలో సుప్రీంకోర్టు కనీస ప్రమాణాలు, ప్రణాళికలను రూపొందించింది’అని ఆయన చెప్పారు. ‘మౌలిక వసతులపై చర్చించేటప్పుడు కొత్త భవనాల నిర్మాణం అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. ఇవి అవసరమే అయినప్పటికీ ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించాల్సి ఉంది’అని సీజేఐ అన్నారు. ముంబై హైకోర్టుకు కొత్త భవనం నిర్మించాలన్న ఆయన..‘అప్పట్లో కేవలం ఏడుగురు జడ్జీలకు మాత్రమే సరిపోయే విధంగా నిర్మించారు. కానీ, ఇప్పుడు అక్కడ 40 మందికి పైగా జడ్జీలు విధులు నిర్వర్తిస్తున్నారు’అని వివరించారు. నాలుగున్నర శతాబ్ధాల ఘన చరిత్ర గోవా న్యాయవ్యవస్థకు ఉందని సీజేఐ జస్టిస్‌ బాబ్డే చెప్పారు. పోర్చుగీస్‌ పాలకులు ఆసియాలోనే మొట్టమొదటి హైకోర్టును 1544లో గోవాలోనే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. గోవా ధర్మాసనంలోని ముగ్గురు జడ్జీల్లో తను కూడా ఉన్నానని, తనను కొందరు గోవా జడ్జీగా పేర్కొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

మౌలిక వసతుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి: జస్టిస్‌ రమణ
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ అవసరాలు తీర్చేందుకు వీలుగా ప్రత్యేకంగా జాతీయ న్యాయ మౌలిక వసతుల కార్పొరేషన్‌ అవసరం ఉందని చెప్పారు. దీనిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలని కోరారు. ఈ కొత్త కార్పొరేషన్‌ న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులకు అవసరమైన ఏకరూపకత, ప్రామాణీకరణను తెస్తుందని చెప్పారు. అన్ని కోర్టులకు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యం, కోర్టు పత్రాల ఈ–ఫైలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వంటివి కూడా మౌలిక వసతుల కిందికే వస్తాయని వివరించారు. ‘శిథిలావస్థకు చేరిన నిర్మాణాల్లో కోర్టులను నిర్వహిస్తున్న ఉదాహరణలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల రికార్డు గదులు కూడా ఉండటం లేదు. వాష్‌ రూంలు, వెయిటింగ్‌ గదులు లేని కోర్టు ప్రాంగణాలు కూడా ఉన్నాయి’అని ఆయన తెలిపారు. కరోనా కారణంగా కేసుల విచారణ వర్చువల్‌గా సాగుతుండటంతో కోర్టులను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లినట్లయిం దన్నారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌లు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు