న్యాయ సమీక్ష పేరుతో ప్రభుత్వాలను నడిపే ప్రయత్నం చేయకూడదు

26 Jul, 2022 01:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సమీక్ష ముసుగులో ప్రభుత్వాలను నడపడానికి కోర్టులు ప్రయత్నించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఉత్తర కర్ణాటకలో ఎగువ కృష్ణా ప్రాజెక్టు భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిపుణుల సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలపై కోర్టు జోక్యం తగదని జస్టిస్‌ ఎస్‌.దీక్షిత్, జస్టిస్‌ పి.కృష్ణ భట్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.

‘‘పాలన అనేది ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. న్యాయ సమీక్ష ముసుగులో కోర్టులు ప్రభుత్వాలను నడపడానికి ప్రయత్నించకూడదు. కేవలం సూచనల మేరకు ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ఆ పనుల్లో చిన్న తప్పులు ఎత్తిచూపడం, అప్రధానమైన అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపడం మా పని కాదు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి’’ అని పేర్కొన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. 

మరిన్ని వార్తలు