కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి 

4 Nov, 2021 13:36 IST|Sakshi

అత్యవసర వినియోగ జాబితాలోకి భారత్‌ తయారీ టీకా 

18 ఏళ్లు దాటినవారంతా తీసుకోవచ్చని సూచన 

అమెరికా, యూరప్‌లలో అప్పుడే అనుమతించరు 

వారి సొంత ఔషధ నియంత్రణ సంస్థల ఆమోదం కావాలి

న్యూఢిల్లీ/జెనీవా: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా ‘కోవాగ్జిన్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్‌ను ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌(ఈయూఎల్‌)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌ఓ బుధవారం ప్రకటించింది. కోవాగ్జిన్‌కు ఈయూఎల్‌ హోదా కల్పించవచ్చంటూ డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన స్వతంత్ర సాంకేతిక సలహా బృందం(టీఏజీ) ప్రతిపాదించడంతో టీకాకు మార్గం సుగమమైంది. 

గర్భిణులకు.. ఇప్పుడే చెప్పలేం 
కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినందుకు గాను డబ్ల్యూహెచ్‌ఓకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు, దేశ ప్రజల విశ్వాసానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్‌ దీపావళి అని పేర్కొన్నారు. దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ భారత్‌కు అభినందనలు తెలియజేశారు. కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో కోవాగ్జిన్‌ చక్కగా పని చేస్తున్నట్లు సాంకేతిక సలహా బృందం గుర్తించింది. దీంతో ఎలాంటి రిస్కు లేదని తేల్చింది. 18 ఏళ్లు దాటిన వారంతా ఈ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ మరో ట్వీట్‌లో సూచించింది.

నాలుగు వారాల వ్యవధితో రెండు డోసులు తీసుకోవాలని పేర్కొంది. అయితే, గర్భిణులకు కోవాగ్జిన్‌ ఇవ్వొచ్చా లేదా అనేది చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం సరిపోదని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న 14 రోజుల తర్వాత కోవాగ్జిన్‌ టీకా కరోనాపై దాదాపు 78 శాతం సమర్థతను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్‌ను నిల్వ చేయడం చాలా తేలిక అని, అందుకే తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలకు ఈ టీకా చక్కగా సరిపోతుందని వివరించింది. లక్షణాలు కనిపించే కరోనాపై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం కోవాగ్జిన్‌ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే రోమ్‌లో జి–20 సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రెయెసస్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి రావడం విశేషం. 

కోవాగ్జిన్‌ షెల్ఫ్‌ లైఫ్‌ 12 నెలలు 
కోవాగ్జిన్‌ టీకా షెల్ఫ్‌ లైఫ్‌ను తయారీ తేదీ నుంచి 12 నెలల దాకా పొడిగించేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ) అంగీకరించినట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ బుధవారం వెల్లడించింది. కోవాగ్జిన్‌ షెల్ఫ్‌లైఫ్‌ అనుమతి తొలుత ఆరు నెలలకే లభించింది. తర్వాత దీన్ని తొమ్మిది నెలలు పొడిగించారు. తాజాగా ఒక సంవత్సరం(12 నెలల) పొడిగించడం విశేషం. అంటే టీకాను తయారు చేసిన తర్వాత 12 నెలల్లోగా ఉపయోగించవచ్చు.   

(చదవండి: కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా)


విదేశాలకు వెళ్లేవారికి ఇక్కట్లు తప్పినట్లేనా? 
భారత్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల ఊరట వ్యక్తమవుతోంది. భారత్‌లో ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది ఈ టీకా తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, కార్మికులు.. ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు. అయితే, కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరగడంతో విదేశాలకు వెళ్లేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోవాగ్జిన్‌ తీసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. సొంత ఖర్చుతో కరోనా పరీక్ష చేయించుకొని నెగెటివ్‌ ఆర్‌టీ–పీసీఆర్‌ రిపోర్టు ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఆమోదం పొంది కరోనా టీకాను తీసుకోక తప్పలేదు.

డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించిన కరోనా టీకాలను ప్రపంచంలో దాదాపు చాలా దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. అయితే అమెరికా, యూరోప్‌ దేశాల్లో మాత్రం వారి సొంత ఔషధ నియంత్రణ సంస్థలు కూడా ఆమోదం తెలిపితేనే... ఏ టీకానైనా అనుమతిస్తారు. అమెరికాలో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ), యూరోప్‌ దేశాల్లో యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) అనుమతులను కోవాగ్జిన్‌ పొందాల్సి ఉంటుంది. తర్వాతే కోవాగ్జిన్‌ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లుగా అమెరికా, యూరోప్‌ దేశాలు పరిగణిస్తాయి. మిగతా దేశాల్లో మాత్రం ఈ టీకా తీసుకున్న భారతీయులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్లీ మరోసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పని ఉండదు.  

చదవండి: ‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’

మరిన్ని వార్తలు