డిసెంబరు నాటికి భారత్‌లో వ్యాక్సిన్‌!

21 Aug, 2020 13:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘కోవాక్సిన్‌’ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. మరోవైపు ట్రయల్స్‌ అన్ని విజయవంతమైన పక్షంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ‘కోవిషీల్డ్’ 2020 చివరి నాటికి భారతీయులకు అందుబాటులోకి రావచ్చునని కూడా పలు రిపోర్టులు చెప్తున్నాయి. వీటితోపాటు జైడుస్‌ కాడిలా తయారు చేస్తున్న ‘జైకోవ్‌ డీ’, ఆక్స్‌ఫర్డ్‌ ‘ఆస్ట్రాజెనికా’తో జతకట్టిన సీరం ఇన్స్‌స్టిట్యూట్‌ ట్రయల్స్‌ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఇవి కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హర్షవర్ధన్ వెల్లడించారు. వ్యాక్సిన్ల తయారీలో భారత్‌ పెద్దన్న పాత్ర పోషిస్తోందని అన్నారు. 
(చదవండి: ప్లాస్మా థెరపీ: అనుమతులు నిలిపివేసిన యూఎస్‌!)

సురక్షిత వ్యాక్సిన్‌తోపాటు సరసమైన ధరలకే దానిని ప్రజలకు అందించే దిశగా ఆయా కంపెనీలు పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇక భారత్‌లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత 50 లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. దానికోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలాఉండగా.. వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ సక్సెస్‌ అవుతుందని రష్యా పేర్కొంది. ఆ సత్తా భారత్‌కు ఉందని తెలిపింది. కాగా, స్పుత్నిక్‌ వీ పేరుతో రష్యా తొలి కరోనా వ్యాక్సిన్‌ను అందబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, సరైన నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద రష్యా వ్యాక్సిన్‌ను తెచ్చిందనే విమర్శలు వెలువడుతున్నాయి. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ పనితీరు త్వరలో వెల్లడి కానుంది.
(డిసెంబరు 3 నాటికి కరోనా కనుమరుగు!)

మరిన్ని వార్తలు