‘క్లినికల్‌’ తరహాలో కోవాగ్జిన్‌ టీకా

5 Jan, 2021 05:53 IST|Sakshi

కేంద్ర మంత్రి హర్షవర్థన్‌

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన తొలి టీకా కోవాగ్జిన్‌ వినియోగానికి ఇచ్చిన అనుమతులు కేవలం క్లినికల్‌ ట్రయల్‌ మోడ్‌లో వినియోగానికేనని ప్రభుత్వం తెలిపింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌కు ఇచ్చిన అనుమతుల్లో తేడాఉందని, కోవాగ్జిన్‌ను కేవలం క్లినికల్‌ ట్రయిల్‌ మోడ్‌లో మాత్రమే వినియోగిస్తామని కేంద్రమంత్రి హర్షవర్థన్‌ వివరణ ఇచ్చారు. అంటే కోవాగ్జిన్‌ ఇచ్చిన వారిని ట్రయిల్స్‌లో చేసినట్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతోపాటు కోవాగ్జిన్‌ను ఫేజ్‌ 3 ట్రయిల్స్‌లో 12 సంవత్సరాలు నిండినవారికి ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించింది. గత ట్రయిల్స్‌లో ఈ టీకాను 12 ఏళ్ల పైబడినవారికి ఇచ్చిన సందర్భంలో సురక్షితమనే తేలింది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌కు ఆదివారం అత్యవసర వినియోగానుమతులు లభించాయి. రెండు టీకాలను రెండు డోసుల్లో ఇస్తారని డీసీజీఐ అనుమతి పత్రంలో పేర్కొంది. ఒకపక్క ఫేజ్‌ 3 ట్రయిల్స్‌ కొనసాగిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాలను వాడేందుకు డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  తొలిదశలో 3 కోట్ల మందికి టీకా అందిస్తారు.  రెండు టీకాలు అత్యవసర అనుమతికి తయారుగా ఉన్నా, ఇంకా ఫేజ్‌ 3 ట్రయిల్స్‌ను పూర్తి చేసుకోలేదు.  

మరిన్ని వార్తలు