డెల్టాపై కోవాగ్జిన్‌ ప్రభావం 65%

4 Jul, 2021 03:19 IST|Sakshi

హైదరాబాద్‌: కోవిడ్‌ 19 వైరస్‌ వేరియంట్లపై భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ చూపే ప్రభావం మదింపు గణాంకాలను కంపెనీ వెల్లడించింది. ఫేజ్‌ 3 ప్రయోగాల విశ్లేషణ అనంతరం కోవాగ్జిన్‌ టీకా సింప్టమాటిక్‌ కోవిడ్‌– 19కు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది.  ఈ టీకా తీసుకున్న 12 శాతం మందిలో సాధారణ సైడ్‌ ఎఫెక్టులు, 0.5 శాతం మందిలో సీరియస్‌ సైడ్‌ ఎఫెక్టులు సేఫ్టీ అనాలసిస్‌ తెలియజేసిందని కంపెనీ వెల్లడించింది. లక్షణాల్లేని కోవిడ్‌కు వ్యతిరేకంగా టీకా 63.6 శాతం రక్షణనిస్తుందని తెలిపింది. సెకండ్‌ డోస్‌ ఇచ్చిన రెండువారాల పాటు దాదాపు 25 నగరాల్లో ఫేజ్‌ 3 ట్రయల్స్‌ను నిర్వహించారు.  టీకా ట్రయల్స్‌తో నూతన ఆవిష్కరణలో ఇండియా సత్తా వెల్లడయిందని కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. ఐసీఎంఆర్‌ సహకారంతో కంపెనీ ఈ టీకా తయారు చేసింది. టీకా ట్రయల్స్‌ ఫలితాలపై ఐసీఎంఆర్‌ సంతృప్తిని వ్యక్తం చేసింది. అన్ని రకాల వేరియంట్లపై కోవాగ్జిన్‌ ప్రభావం చూపుతుందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ భార్గవ చెప్పారు. ప్రపంచ టీకా ఉత్పత్తి రంగంలో భారత స్థానాన్ని కోవాగ్జిన్‌ మరింత బలోపేతం చేసిందన్నారు.

వ్యాక్సిన్‌ డోసులు @ 34.46 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 43,99,298 వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 44,111 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 6 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 50వేలలోపు నిర్ధారణయ్యాయి. కోవిడ్‌ బారినపడి ఒక్క రోజులోనే మరో 738 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,01,050కు పెరిగాయి. అదే సమయంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా రోగుల సంఖ్య 4,95,533కు చేరింది. 97 రోజుల తరువాత ఈ సంఖ్య 5 లక్షల లోపుకు పడిపోయింది. గత 24 గంటల్లోనే కరోనా చికిత్సలో ఉన్న వారి సంఖ్య 14,104కు తగ్గింది. మరోవైపు కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 51 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ కోవిడ్‌ బారిన పడి కోలుకున్న వారు 2,96,05,779 మంది కాగా, గత 24 గంటల్లో 57,477 మంది కోలుకున్నారు. అంతకు ముందురోజు కంటే 13,366 మంది అదనంగా కోలుకున్నారు. దీంతో  కోలుకున్న వారి శాతం 97.06కు పెరిగింది.

మరిన్ని వార్తలు