టీకాపై ఎటూ తేల్చుకోలేక..

7 Jan, 2021 05:58 IST|Sakshi

తొందర లేదన్న వారు 69 శాతం:  సర్వే

న్యూఢిల్లీ: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నవారు 69 శాతం మంది ఉన్నారని లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా మీరు టీకా తీసుకుంటారా? అని 8,723 మందిని ప్రశ్నించగా 26 శాతం మంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కాగానే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సంవత్సరం అక్టోబర్‌ నుంచి ఈ సంస్థ ప్రజల్లో టీకా ఆమోదంపై సర్వే చేçస్తూ ఫలితాల్ని ఆన్‌లైన్‌లో ఉంచుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ టీకాపై ఎటూ తేల్చుకోలేని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

అక్టోబర్‌లో 61 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోవడం గురించి ఇంకా ఆలోచిస్తున్నామని చెబితే నవంబర్‌ నాటికి వారి సంఖ్య 59 శాతానికి తగ్గింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) టీకాలకి పచ్చజెండా ఊపాక టీకాపై సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆ సర్వే వెల్లడించింది. ఇక పిల్లలకి టీకా ఇవ్వడానికి 26% తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్‌ సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలు, హడావుడిగా అనుమతులివ్వడం, దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రజల్లో వ్యాక్సిన్‌ పట్ల ఆందోళన నెలకొని 69 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారని లోకల్‌సర్కిల్స్‌ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాల రేటు చాలా తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న వారు కూడా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు