కరోనా మృతుల ముక్కు, గొంతులో.. 24 గంటల్లో వైరస్‌ నిర్వీర్యం

26 May, 2021 01:59 IST|Sakshi

వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ   

ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగం చీఫ్‌ డాక్టర్‌ సుదీర్‌ గుప్తా

న్యూఢిల్లీ: కరోనా బారినపడి మృతిచెందిన వారిలో వైరస్‌ ఆనవాళ్లు ఎన్ని రోజులపాటు ఉంటాయన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల చనిపోయిన వారిలో వైరస్‌ కచ్చితంగా సజీవంగా ఉంటుందని, అది మరొకరికి వ్యాపిస్తుందన్న అంచనాతో ప్రత్యేకమైన జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే, చనిపోయిన తర్వాత బాధితుల ముక్కు, గొంతులో వైరస్‌ 12 నుంచి 24 గంటలకు మించి క్రియాశీలకంగా ఉండదని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఫోరెన్సిక్‌ విభాగం అధినేత డాక్టర్‌ సుదీర్‌ గుప్తా మంగళవారం చెప్పారు. మృతుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు భారీగా తగ్గిపోతాయని అన్నారు.

కరోనా బాధితుల మృతదేహాలపై ఎయిమ్స్‌లోని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో గత ఏడాదికాలంగా ఒక పైలట్‌ స్టడీని  నిర్వహించారు. దాదాపు 100 మృతదేహాలను పరీక్షించారు. మరణించిన తర్వాత 12 నుంచి 24 గంటల మధ్య కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, నెగెటివ్‌ అని తేలింది. అంటే ఆయా మృతదేహాల్లో కరోనా వైరస్‌ క్రియాశీలతను కోల్పోయింది. పూర్తిగా బలహీనపడింది. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా చనిపోతే.. 24 గంటల తర్వాత మృతదేహంలోని ముక్కు, నోటి భాగాల్లో వైరస్‌ యాక్టివ్‌గా ఉండదని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు డాక్టర్‌ సుధీర్‌ గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ కరోనా సంబంధిత మృతదేహాలను దహనం లేదా ఖననం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ముక్కు, గొంతులో వైరస్‌ ఆనవాళ్లు లేకున్నా శరీరం లోపలి నుంచి ప్రమాదకరమైన ద్రవాలు వాటి ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకే కరోనా సంబంధిత మృతదేహాల ముక్కు, గొంతును పూర్తిగా మూసి ఉంచాలన్నారు. అంత్యక్రియలు నిర్వహించేవారు పీపీఈ కిట్లు, మాసు్కలు ధరించాలని తెలిపారు. కరోనా సోకి మృతిచెందిన వారి అంత్యక్రియలు ముగిశాక బూడిద, ఎముకల్లో వైరస్‌ ఎంతమాత్రం ఉండదని డాక్టర్‌ సు«దీర్‌ గుప్తా పేర్కొన్నారు. వాటిని సేకరించడంలో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. వాటి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు లేవన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు