ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

9 May, 2021 17:59 IST|Sakshi

లాక్‌డౌన్‌ అమలులో కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్న ఢిల్లీ సీఎం

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు 13,23,567 కి చేరుకోగా.. 300 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కోవిడ్‌ వల్ల 19,344 మంది మృతి చెందారు. ఆదివారం 61,552 మందికి పరీక్షలు చేయగా, దీనిలో 49,787 ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో 11,765 మందికి వేగంగా యాంటిజెన్‌ పరీక్షలు జరిగాయి. కాగా పాజిటివ్‌ కేసులు స్వల్వంగా తగ్గి 86,232 కు చేరుకున్నాయి. కోవిడ్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌ ఉన్న 52,263 మంది ఇంటి నుంచే కోలుకుంటున్నారు. 

రాజధానిలో లాక్‌డౌన్‌ పొడగింపు
దేశ రాజధానిలో కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు. మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామన్నారు. మెట్రో సర్వీసులను కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. పలు వర్గాలకు చెందిన వారితో చర్చించిన అనంతరం లాక్‌డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.

14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌!
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,736 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 4,000 మంది చనిపోయారు.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు