ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు.. వారం రోజుల్లోనే..

12 Jan, 2022 21:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా భావించవద్దని కేంద్రం హెచ్చరించింది. కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, కేవలం వారం రోజుల్లోనే 300 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం దాటిందని స్పష్టం చేసింది. అయితే.. డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

అటు.. కరోనా బాధితుల డిశ్చార్జ్‌ పాలసీని సవరించినట్లు చెప్పిన అగర్వాల్‌.. కోవిడ్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చి.. స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులను ఏడు రోజుల్లో డిశ్చార్జ్‌ చేయాలన్నారు. వీరికి మళ్లీ వైరస్‌ నిర్థారణ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. మరోవైపు థర్డ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్‌ ఆక్సిజన్‌ను బఫర్‌ స్టాక్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. మెడికల్‌ ఆక్సిజన్‌ కంట్రోల్‌ రూమ్‌లను పటిష్ట పర్చాలని సూచించింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్‌ లభ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాణవాయువు కొరత ఏర్పడితే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు