కరోనా మార్చిన అలవాట్లు.. యుగోవ్‌ సర్వే ఏం చెప్తోంది..?

16 May, 2021 02:10 IST|Sakshi

81% మందిలో మారిన షాపింగ్‌ ధోరణులు 

జంక్‌ఫుడ్‌కు 47% మంది దూరం 

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వినియోగం తగ్గించిన 32% మంది 

గతంలో కంటే 29% అధికంగా మద్యపానం  

కాస్మోటిక్స్‌ కొనుగోలు తగ్గించిన 36% మంది 

యూగోవ్‌ చేపట్టిన సర్వేలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల షాపింగ్‌ వైఖరిలో గణనీయంగా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలలో మార్కెట్‌ పరిశోధన సంస్థ యుగోవ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటికొచ్చింది. ఈ మార్పులు ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, భారత్, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 18 వేల మంది పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవి ఇవీ.. 

తగ్గిన జంక్‌ఫుడ్‌ వినియోగం 
కరోనా కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధించారు. వైరస్‌ తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. జంక్‌ఫుడ్‌కు బదులుగా ఎక్కువ పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను తమ డైట్‌ చార్ట్‌లో చేర్చినట్లు 66 శాతం మంది సర్వే సందర్భంగా తెలిపారు. అదే సమయంలో మిగతా దేశాల్లోని 38% మంది ఈ విషయాన్ని అంగీకరించారు. 28% మంది జంక్‌ఫుడ్‌ తినడం తగ్గించినట్లు కూడా తెలిపారు. అదే సమయంలో భారత్‌లో 47% మంది ప్రజలు జంక్‌ఫుడ్‌ తగ్గించినట్లు పేర్కొన్నారు. మిగతా దేశాల్లోని 15% మంది ప్రజలు ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తినడం తగ్గించామని చెబితే, భారత్‌లో ఇది 32%గా ఉంది. అదే సమయంలో, భారత్‌లో 29%, చైనాలో 27% మంది ప్రజలు మునపటి కంటే అధికంగా మద్యం తీసుకున్నామన్నారు. ఇతర దేశాల వారిలో ఇది 25%గా ఉంది.  

కాస్మోటిక్స్‌పై తగ్గిన మోజు 
సర్వేలో మరో ఆసక్తికర విషయం సైతం వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విధించిన ఆంక్షల ప్రభావం, కాస్మోటిక్‌ ఉత్పత్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని కారణంగా కాస్మోటిక్‌ కొనుగోళ్ళు తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో 36% మంది ప్రజలు ప్రస్తుతం కాస్మోటిక్‌ ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రపంచంలో 33% మంది ప్రజలు సౌందర్య ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేశామని వెల్లడించారు. 

స్థానిక కిరాణా షాపులకు ఊతం 
దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షాపింగ్‌ మాల్స్, సూపర్‌మార్కెట్లు, పెద్ద దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే అలవాటు తగ్గి, దగ్గర్లోని చిన్న కిరాణా షాపులకు మారింది. భారతదేశంలో ప్రజలు చిన్న వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు ఇంటి సమీపంలో ఉన్న దుకాణాల నుంచి వస్తువులను కొనుగోలు చేయడం కొనసాగించారు. మొత్తం 17 దేశాలలో 60% మంది స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని అనుకుంటున్నామని తెలిపారు. 

కావాల్సినవి మాత్రమే కొంటున్నారు 
ఈ మహమ్మారి సమయంలో కావాల్సిన వస్తువులను మాత్రమే కొంటున్నారని సర్వేలో తేలింది. ఇటువంటి షాపింగ్‌ ఇండోనేసియాలో 92%, భారతదేశంలో 90% మందికి, అగ్రరాజ్యం అమెరికాలోని 74% మందికి అలవాటైంది. మెక్సికోలో 83%, భారత్‌లో 81% మంది కరోనా కారణంగా తమ షాపింగ్‌ అలవాట్లు మారిపోయాయని చెప్పారు. అయితే ఈ ప్రభావం చైనీయులపై ఏమాత్రం కనిపించలేదు. కరోనా వల్ల వచ్చిన మార్పులతో చైనా మార్కెట్‌ తక్కువగా ప్రభావితమైంది. గతేడాది కరోనా వైరస్‌ను కనుగొన్న తరువాత చైనాలో లాక్‌డౌన్‌ విధించారు. అయినప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు