Delhi: ఒకేసారి 50 మృతదేహాలను దహనం చేస్తున్నారు!

28 Apr, 2021 12:33 IST|Sakshi
ఢిల్లీలోని సుభాష్‌నగర్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం మృతదేహాలను వరుసలో ఉంచిన దృశ్యం 

అంత్యక్రియలకూ తప్పని నిరీక్షణ

న్యూఢిల్లీ: కోవిడ్‌ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలిన తమ వారి అంత్యక్రియల కోసం సైతం బంధువులు గంటలకొద్దీ సమయం శ్మశానాల్లో ఎదురుచూడాల్సిన దుర్భర పరిస్థితులు ఢిల్లీలో తలెత్తాయి. గంటగంటకు కోవిడ్‌ బాధితుల మృతదేహాలు శ్మశానాల వద్ద పోగుబడుతున్నాయి. అన్నింటినీ ఒకేసారి దహన సంస్కారాలు చేసే ఏర్పాట్లు అక్కడ లేవు. దాంతో దాదాపు 20 గంటలకుపైగా అంత్యక్రియల కోసం వేచి ఉండాల్సి వస్తోందని బంధువులు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ నెలలో 3,601 మంది చనిపోతే అందులో గత ఏడు రోజుల్లో చనిపోయిన వారే 2,267 మంది ఉన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితిని ఢిల్లీని ఎదుర్కొంటోంది. మృతదేహాలు ఎక్కువ అవుతుండటంతో ఒకేసారి 50 మృతదేహాలను దహనం చేస్తున్నారు. 

నాన్నను కోల్పోయా..
‘గుండెపోటుతో బాధపడుతున్న మా నాన్నను చాలా ప్రైవేట్‌ ఆస్పత్రులు తిప్పాం. ప్రతీ ఒక్కరూ కోవిడ్‌ నెగటివ్‌ రిపోర్ట్‌ అడిగారేగాని ఏ ఒక్కరూ కనీసం మా నాన్నను చెక్‌చేయలేదు. అడ్మిట్‌ చేసుకోలేదు. చివరకు నాన్నను కోల్పోయాను’ అని వెస్ట్‌ ఢిల్లీవాసి అమన్‌ అరోరా వాపోయారు. ‘ఢిల్లీలోని శుభాష్‌నగర్‌ శ్మశానవాటికలోని సీఎన్‌జీ ఛాంబర్‌లో ఒక్కో మృతదేహాన్ని దహనం చేయడానికి 90 నిమిషాలు పడుతుంది. అక్కడ మరో 24 మృతదేహాల దహనానికి స్లాట్‌ అప్పటికే పూర్తయిపోయింది’ అని సిబ్బంది చెప్పారు. మరణాలు పెరగడంతో అదనంగా 100 తాత్కాలిక చాంబర్లను నిర్మించారు.

చదవండి: ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాల్ని కుక్కేశారు

మరిన్ని వార్తలు