కరోనా సంక్షోభం : కేంద్రానికి మాజీ ప్రధాని సలహాలు

11 Aug, 2020 10:21 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం, పౌరుల జీవనోపాధిపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రమైన దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం అనివార్యమని మన్మోహన్ వ్యాఖ్యానించారు. కానీ ఈ అంశాన్ని ఆర్థిక గణాంకాలకంటే సమాజం దృష్టికోణం నుంచి చూడటం చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ  ప్రభుత్వానికి  కొన్ని సూచనలు చేశారు.

కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల జీవనోపాధిని కాపాడాలని, వ్యాపారాలకు రుణ హామీ ఇవ్వాలని ప్రధాని మోదీకి సూచించారు. ఆర్థిక మందగమనాన్ని "మానవతా సంక్షోభం"గా అభివర్ణించిన ఆయన ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు గణనీయమైన ప్రత్యక్ష నగదు సహాయాలను అందించాలన్నారు. "ప్రభుత్వ మద్దతుగల క్రెడిట్ హామీ కార్యక్రమాల" ద్వారా వ్యాపారాలకు తగిన మూలధనాన్ని అందుబాటులో ఉంచాలి, సంస్థాగత స్వయం ప్రతిపత్తి ద్వారా ఆర్థిక రంగాన్ని రక్షించాలంటూ మూడు కీలక సూచనలు చేశారు. 

కరోనా కట్టడికి లాక్ డౌన్ అవసరమే అయినప్పటికీ కేంద్రం సరిగ్గా వ్యవహరంచలేదని ఆయన విమర్శించారు. అకస్మాత్తుగా, ఆలోచనా రహితంగా, ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్, కఠిన ఆంక్షలు ప్రజలు తీవ్రంగా బాధించాయని  మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించే బావుండేదని పేర్కొన్నారు. కేంద్ర విస్తృత మార్గదర్శకాలతో, స్థానిక పరిపాలనా సంస్థలు కోవిడ్-19 నివారణలో  ఇంకా ఉత్తమంగా పనిచేసే ఉండేవని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో "అధిక రుణాలు"  అవసరమే అని చెప్పిన ఆయన సైనిక, ఆరోగ్యం, ఆర్ధిక సవాళ్ల అవసరాలకు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో అదనంగా 10 శాతం ఖర్చు చేయవలసి వచ్చినా, అది తప్పదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, సరిహద్దు రక్షణ, జీవనోపాధి పునరుద్ధరణ, ఆర్థిక వృద్ధికి  అధిక రుణాలు అవసరమని  చెప్పారు.

కాగా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. జీడీపీ గణనీయంగా తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. దేశీయంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  జీడీపీ 5 శాతానికి క్షీణిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.  ఏప్రిల్-జూన్ త్రైమాసిక  జీడీపీ గణాంకాలు  ఈ నెలలో  వెల్లడికానున్నాయి 

మరిన్ని వార్తలు