Indians Data Leak: వేలాది భారతీయుల వివరాలు లీక్‌!

22 Jan, 2022 04:08 IST|Sakshi

ప్రభుత్వ సర్వర్‌ నుంచి లీకైన కోవిడ్‌ సంబంధిత వివరాలు

ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టిన సైబర్‌ నేరగాళ్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన సర్వర్‌ నుంచి వేలాదిమంది భారతీయులకు చెందిన వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. పలువురి పేర్లు, మొబైల్‌ నెంబర్లు, చిరునామాలు, కోవిడ్‌ పరీక్షా వివరాలతో కూడిన డేటా ఆన్‌లైన్‌ సెర్చ్‌లో ప్రత్యక్షమైంది. ఈ లీకైన వివరాలను రైడ్‌ ఫోరమ్స్‌ వెబ్‌సైట్‌లో ఒక సైబర్‌ క్రిమినల్‌ అమ్మకానికి కూడా పెట్టాడు. ఇలా దాదాపు 20వేల ఇండియన్ల వ్యక్తిగత వివరాలు అమ్మకానికి కనిపిస్తున్నాయి.

ప్రభుత్వానికి చెందిన ఒక సీడీఎన్‌ (కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌) నుంచి ఈ వివరాలు బహిర్గతమయ్యాయని, ఈ వివరాలు డార్క్‌ వెబ్‌లో కూడా లభిస్తున్నాయని, సెర్చ్‌ ఇంజన్లలో లభిస్తున్న దాదాపు 9 లక్షల వివరాలను గూగుల్‌ ఇండెక్స్‌ చేసిందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్‌ రాజాహారియా ట్వీట్‌ చేశారు. వీటన్నింటినీ డీ ఇండెక్స్‌ వెంటనే డీఇండెక్స్‌ చేయాలని హెచ్చరించారు. (ప్రశ్నలకు వేగంగా జవాబులిచ్చేందుకు సెర్చ్‌ ఇంజన్‌లు శోధనకు ముందు సమాచారాన్ని సమీకరించే ప్రక్రియను ఇండెక్సింగ్‌ అంటారు).

ఈ విషయమై ఐటీ శాఖ ఇంతవరకు స్పందించలేదు. రాపిడ్‌ ఫోరమ్స్‌లో అమ్మకానికి పెట్టిన శాంపిల్‌ డాక్యుమెంట్‌లో ఈ వివరాలన్నీ కోవిన్‌ పోర్టల్‌లో అప్‌లోడింగ్‌కు ఉంచిన డేటాగా చూపుతోంది. కరోనా కాలంలో నిబంధనల పర్యవేక్షణ నుంచి వ్యాక్సినేషన్‌ వరకు పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కువగా డిజిటల్‌ సాంకేతికతపై ఆధారపడింది. ఈ దశలో ప్రభుత్వ సర్వర్‌నుంచి డేటా లీకైనట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రజలు నకిలీ కాల్స్, ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజశేఖర్‌ సూచించారు.  

కోవిన్‌ నుంచి ఎలాంటి లీకులు లేవు
కోవిన్‌ పోర్టల్‌ నుంచి ఎలాంటి లీకేజీ జరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లోని ప్రజల వివరాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. కోవిన్‌లో వ్యక్తుల చిరునామాలుకానీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షా వివరాలు కానీ సేకరించలేదని గుర్తు చేసింది. కోవిన్‌ పోర్టల్‌ నుంచి డేటా లీకైందన్న వార్తలు వస్తున్నాయని, కానీ ఈ పోర్టల్‌ సురక్షితమని, ఎలాంటి వివరాలు బయటకు పోలేదని మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు